ఇతర రాష్ట్రాల బస్సులు తిరుగుతున్నా అదే ఉదాసీనత జిల్లా అధికారుల తీరుతో ప్రయాణికులకు రక్షణ శూన్యం ఖజనాకు గండి పడుతున్నా మొద్దు నిద్ర వీడని చంద్రబాబు ప్రభుత్వం
పట్నంబజారు: మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పొందిన వాహనం మరో రాష్ట్రంలో నడవాలంటే తప్పనిసరిగా ఇంటర్ స్టేట్ పర్మిట్ ఉండాలి. రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందాల ప్రకారం మాత్రమే ఈ అనుమతులు ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ నడిచే వాహనాలపై భారీ జరిమానాలు, వాహనాల స్వాధీనం, పర్మిట్ రద్దు వంటి చర్యలు తీసుకునే అధికారం ఉంది. గుంటూరు జిల్లాలో ఇవి కఠినంగా అమలు కావటం లేదు. జిల్లాలో నాగాలాండ్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలకు చెందిన బస్సులు ఇక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులే నడుపుతున్నారు. ఎంట్రీ ట్యాక్స్, కాంపోజిట్ ట్యాక్స్ చెల్లించాలి. అయితే అనేక ప్రైవేట్ బస్సుల వారు ఈ పన్నులను తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిపోతోంది. చట్టబద్ధంగా నడిచే ఆపరేటర్లకు అన్యాయం జరుగుతోంది.
అటకెక్కిన నిబంధనలు
మరోవైపు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని, గడువు ముగిసిన బస్సులు రోడ్లపైకి రావడం అత్యంత ప్రమాదకరంగా మారింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి కమర్షియల్ వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. బ్రేకులు, టైర్లు, లైటింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు వంటి అంశాలు సరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ తనిఖీలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డ్రైవర్ల విషయంలోనూ...
దూర ప్రయాణాల బస్సులకు కనీసం ఇద్దరు అర్హత కలిగిన డ్రైవర్లు ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క డ్రైవర్‌తోనే ప్రయాణాలు, రెండో డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడం, అలసటతో డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 3, 10 ప్రకారం ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు నడపాలంటే హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయం లోపించడం, రాత్రి వేళల్లో తనిఖీలు చేయకపోవడం, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు పూర్తిగా వినియోగంలో లేకపోవడం ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. ఇటీవలి ప్రమాదాలు కూడా అధిక వేగం, డ్రైవర్ అలసట, ఫిట్‌నెస్ లోపాల వల్లే జరిగినట్లు తేలింది.
కఠిన చర్యలు ముఖ్యం
నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత బస్సుల యజమానులకు భారీ జరిమానాలు, బస్సు సీజ్, పర్మిట్ రద్దు, డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ వంటి చర్యలు నిర్బంధంగా అమలు చేయాలి. ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు చేపట్టడం, ఇతర రాష్ట్రాలతో డేటా సమన్వయం పెంచడం, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేయడం అవసరం. ప్రజలూ బస్సులో ప్రయాణించే ముందు వివరాలు పరిశీలించడం, అనుమానాస్పద పరిస్థితుల్లో అధికారులకు ఫిర్యాదు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా రవాణాశాఖ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్నా.. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నా, ప్రైవేట్ ట్రావెల్స్ టిక్కెట్ ధరలు భారీగా పెంచినా వారు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని సదరు జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకుని వెళితే.. ‘‘మనం ఏం చేస్తాం.. మన చేతిలో ఏముంది..? వాళ్లు మన మాట వినరని’’ చెప్పటం కొసమెరుపు.


