విత్తన చట్టం.. మోసాలకు కళ్లెం | - | Sakshi
Sakshi News home page

విత్తన చట్టం.. మోసాలకు కళ్లెం

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

ప్రైవేట్‌ విత్తన, ఎరువుల దుకాణాల్లో లైసెన్స్‌ల ప్రదర్శన తప్పనిసరి ప్రతి కొనుగోలుదారుకూ రశీదు ఇవ్వాల్సిందే

విత్తన లైసెన్స్‌ ప్రదర్శించాలి..

కొరిటెపాడు(గుంటూరు): ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ పనులు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో ప్రైవేట్‌ ఎరువులు, విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు అంటగట్టే ముఠాలు లేక పోలేదు. రైతులను మోసగించే చర్యలకు కళ్లెం వేసేందుకు విత్తన చట్టం ఒకటి ఉందని పూర్తిస్థాయిలో రైతులకు తెలియదు. దుకాణంలో ఒక రకమైన విత్తనం ఉంచుకుని రైతులకు మరో రకం విత్తనాలు అంటగట్టే మోసాలకు చెక్‌ పెట్టేలా విత్తన చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

మోసగిస్తే కఠిన చర్యలు

విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతుకు ఎలాంటి అన్యాయం జరిగినా విత్తన చట్టం ద్వారా సంబంధిత విత్తన డీలర్లపై కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడే వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 3 కింద అతిక్రమించినందుకు ఆయా దుకాణాల్లో విత్తనాలను జప్తు చేయడంతోపాటు అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్‌–ఏ ప్రకారం జరిమానా విధిస్తారు. వీటిలో కొన్ని చట్టాలను గమనిస్తే..

ధరల బోర్డు, స్టాకు బోర్డు ఏర్పాటు చేయాలి..

విత్తనాలు విక్రయించే దుకాణాల్లో కచ్చితంగా ధరలు, స్టాకు బోర్డులను ఏర్పాటు చేయాలి. అలా లేకుంటే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 8 ప్రకారం ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. అధికారులు వచ్చి ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెండ్‌, రద్దు చేయవచ్చు.

అమ్మకాల రశీదు ఇవ్వాల్సిందే..

విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు ఆయా దుకాణదారుడు కచ్చితంగా రశీదు ఇవ్వాలి. రశీదు ఇవ్వని పక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 9 ప్రకారం ఆయా దుకాణదారునికి ముందుగా నోటీసు జారీ చేసి దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే ఆయా డీలర్‌ లైసెన్స్‌ సస్పెండ్‌, రద్దు చేయవచ్చు.

విత్తనాల బస్తాలపై లేబుల్‌ లేకపోతే..

ప్రైవేట్‌ విత్తనాల అమ్మకందారుడి వద్ద కొనుగోలు చేసిన విత్తనాల బస్తాలకు లేబుల్‌ లేకపోతే విత్తన చట్టం–1966 సెక్షన్‌ 7 ప్రకారం చర్యలు చేపట్టవచ్చు. అంతే కాకుండా ఆయా విత్తనాలను జప్తు చేసే అధికారం ఉంది. అత్యవసర సరుకుల చట్టం–1955 సెక్షన్‌ 7 ప్రకారం జరిమానా విధిస్తారు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం–1966 సెక్షన్‌ 7 ప్రకారం విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8ను అనుసరించి డీలర్‌ లైసెన్స్‌ సస్పెండ్‌, రద్దు చేస్తారు.

జిల్లాలో ఇలా..

గుంటూరు జిల్లాలో సుమారు 500 ప్రైవేట్‌ డీలర్ల దుకాణాలు ఉన్నాయి. వాటిలో సుమారు 220 మంది విత్తనాల విక్రయాల డీలర్లు, 230 మంది ఎరువుల విక్రయాల డీలర్లు, మరో 250 మంది పురుగు మందుల విక్రయాల డీలర్లు ఉన్నారు.

ప్రైవేట్‌ విత్తన విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా విత్తన లైసెన్స్‌లను ప్రదర్శించాలి. విత్తన లైసెన్స్‌ లేకుంటే ఆయా దుకాణాల్లో విత్తనాల విక్రయాలు చేయకూడదు. అంతేకాకుండా నోటీసులు ఇచ్చి దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు–5 ప్రకారం డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేయడానికి, సస్పెండ్‌ చేసేందుకు వ్యవసాయ అధికారులకు పూర్తి అధికారముంది. అలాగే రద్దు కూడా చేయవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement