మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో వున్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎగువ సన్నిధిలో వున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు.


