ముఖ్య గణాంకాలు ఇవీ...
జీజీహెచ్‌లో రోజూ ఓపీకి వచ్చే కిడ్నీ రోగులు – 100 నుంచి 150 మంది
వీరిలో డయాలసిస్ అవసరమైన రోగులు – 80 నుంచి 100 మంది
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవసరమయ్యే వారి సంఖ్య – సుమారు 30 నుంచి 40 మంది
2016 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబరు వరకు జరిగిన ఆపరేషన్లు – 24
రెండున్నరేళ్లుగా గుంటూరు జీజీహెచ్‌లో శస్త్రచికిత్సలు నిలిపివేత కిడ్నీ ఆపరేషన్‌ల కోసం ఎదురు చూస్తున్న పేద రోగులు గతంలో విజయవంతంగా 24 ఆపరేషన్లు చేసిన వైద్యులు నూతన సూపరింటెండెంట్ దృష్టి సారిస్తేనే సమస్యకు పరిష్కారం
ప్రతినెలా 15కుపైగా ఆపరేషన్లు...
గుంటూరు మెడికల్: కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్ సందీప్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించాలని 2023 అక్టోబర్‌లో గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. జీజీహెచ్ వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించి, సందీప్ తల్లి పద్మావతి కిడ్నీ దానం చేయడంతో 2023 డిసెంబరు 19న ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. సుమారు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు.
అయితే, నాటి నుంచి నేటి వరకు దాదాపు రెండున్నరేళ్లుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయకుండా జీజీహెచ్ వైద్యులు మిన్నకుండిపోతుండటం పేద రోగుల పాలిట శాపంగా మారింది. నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఆపరేషన్లు నిలిపివేశారు. ఫలితంగా పేద రోగులు గత్యంతరం లేక ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుందని, అంత మొత్తం భరించలేక జీజీహెచ్‌కు వస్తుంటే వైద్యులు ఆపరేషన్లు చేయకుండా వాయిదా వేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
రెండున్నర సంవత్సరాలుగా అంతే..
ఎంతో ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు 2023 డిసెంబరు వరకు కొనసాగినా, ఆ తర్వాత ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. కిడ్నీ రోగులు ఆపరేషన్ల కోసం జీజీహెచ్‌కు వస్తున్నప్పటికీ, వైద్యులు స్పందించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలుగా ఒక్క కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా చేయకుండా నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల వైద్యులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరికి డయాలసిస్ ద్వారా సమస్య నియంత్రణలోకి వస్తుంది. అయితే డయాలసిస్‌తోనూ ఆరోగ్యం మెరగుపడని వారిలో సుమారు 30 శాతం మందికి తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎంతో ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడవచ్చు.
2016 నుంచి కిడ్నీ ఆపరేషన్లు...
గుంటూరు జీజీహెచ్‌లో 2016 ఫిబ్రవరి నుంచి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు. 2016 నుంచి 2023 డిసెంబరు వరకు మొత్తం 24 మందికి విజయవంతంగా నిర్వహించారు. తద్వారా ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ నిధులు కూడా అధికంగా లభించడంతో కిడ్నీ, యూరాలజీ వార్డులు అభివృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి సమయంలో రెండేళ్లకుపైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తిరిగి ఆపరేషన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. దీంతో 2023 డిసెంబరులో తిరిగి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. ఆయన అనంతరం సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యశస్వి రమణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దృష్టి సారించకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని ప్రకటించారు. ఆయన వైద్యుల నిర్లక్ష్యంపై దృష్టి సారించి, నిలిచిపోయిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను తిరిగి ప్రారంభించి పేద, మధ్యతరగతి రోగులకు భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోవడంతో జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకునే వారు తప్పనిసరిగా గుంటూరు జీజీహెచ్‌లోని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కమిటీ వైద్యుల అనుమతి తీసుకోవాలి. తొలుత గ్రామంలోని రెవెన్యూ, పోలీసు అధికారుల ధ్రువీకరణలు పొందిన తర్వాత జీజీహెచ్ కమిటీ అనుమతి కోసం రోగులు వస్తుంటారు. ఇలా ప్రతినెలా సుమారు 15 మందికి పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు అనుమతులు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసినప్పటికీ, కొంత మేరకు రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. మందులకు ప్రత్యేకంగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. జీజీహెచ్‌లో ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడంతో పాటు ఏడాది పాటు ఆరోగ్యశ్రీ ద్వారా మందులు కూడా ఉచితంగా అందిస్తారు. అందువల్ల ఎక్కువ మంది రోగులు జీజీహెచ్‌లోనే ఆపరేషన్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.


