చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు సీఐలకు హైకోర్టు నోటీసులు సీఎం, డెప్యూటీ సీఎం, హోంమంత్రి వైఖరితో దిగజారిన శాంతిభద్రతలు సిట్ విచారణతో సాయికృష్ణ కేసును నీరుగార్చేందుకు సర్కారు ప్రయత్నం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
సీబీఐ దర్యాప్తు చేయిస్తాం...
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రోద్బలంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా తనపై అక్రమ కేసులు మోపిన పోలీసులు హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ లీగల్‌సెల్ టీమ్‌తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా వ్యవహరించిన నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్‌ఐ మధుపవన్‌తో పాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లును ఈ నెల 30వ తేదీలోగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత వైఖరితో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాకప్‌డెత్‌లు, కస్టోడియల్ టార్చర్‌లతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. సిట్ విచారణతో గాదె సాయికృష్ణ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కృష్ణలంక సీఐ నాగరాజును కాపాడేందుకే సాక్ష్యాధారాలను తుడిచి వేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని, పోలీసులే హంతకులుగా మారి హత్యలు చేస్తుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. నాగరాజు నోరు మెదిపితే పెద్దలకు ముప్పు తప్పదన్నారు. ఎవ్వరినైనా అక్రమంగా అరెస్టు చేసి, చంపేసే ధోరణి సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం, డీసీఎం, హోంమంత్రి విఫలమయ్యారని, వాస్తవాలు మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై పవన్ కల్యాణ్‌కు కోపమెందుకని అంబటి ప్రశ్నించారు. సాయికృష్ణను హత్య చేశారంటే అతనికి నేరచరిత్ర ఉందని మాట్లాడని పవన్ కల్యాణ్... సాయికృష్ణను హత్య చేసిన సీఐ నాగరాజును సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ఈనెల 29న హైకోర్టులో ఏం చెప్పబోతున్నారని, ఈ కేసులో విచారణ లోపభూయిష్టంగా జరుగుతోందని పేర్కొన్నారు.
సీసీ ఫుటేజ్ స్టేషన్‌లో లేకుంటే కమిషనర్ దగ్గర సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్‌లో ఉంటుందని, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము సీబీఐ దర్యాప్తు చేయిస్తామని అంబటి చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో తనను తిట్టించేందుకు శిక్షన ఇస్తున్నారని, తాము అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు అవసరం లేదని, నోటీసు ఇచ్చి పంపేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ తనను అరెస్టు చేసి, హింసించారని చెప్పారు. తన ఇంటిపై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయం కోరుతూ ఇప్పటికే పలుదఫాలుగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించానని, జూలై 29న డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళతానని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, ప్రధాన కార్యదర్శి మొండితోక శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, యేటి కోటేశ్వరరావు, రమావతు లలిత, ఇందిర, పి.వెంకటేశ్వర్లు, వి.బ్రహ్మారెడ్డి, కాసు వెంకట రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భాను పాల్గొన్నారు.


