క్రీడా పాఠశాలకు ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాలకు ఎంపిక పోటీలు

Jun 25 2026 5:17 AM | Updated on Jun 25 2026 5:17 AM

క్రీడా పాఠశాలకు ఎంపిక పోటీలు పల్స్‌ పోలియోను విజయవంతం చేయండి డీఎల్‌పీఓ కార్యాలయంలో విచారణ జాతీయ వైద్య మండలి ఇన్‌స్పెక్టర్ల పర్యటన

నరసరావుపేట ఈస్ట్‌: కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో ప్రవేశాల నిమిత్తం బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో 4 నుంచి 6వ తరగతి ప్రవేశాలకు శారీరక, వైద్య పరీక్షలతోపాటు వివిధ క్రీడాంశాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయలక్ష్మి

తెనాలి అర్బన్‌: ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాత మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం మెడికల్‌ ఆఫీసర్లు, హెల్త్‌ సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నూరు శాతం జరిగే విధంగా చూడాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ శ్రావణ్‌ బాబు మాట్లాడుతూ పోలియా రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఈరుగుల అన్నపూర్ణ, మున్సిపల్‌ ఆరోగ్యాధికారి డాక్టర్‌ మొవ్వా యేసుబాబు పాల్గొన్నారు.

తెనాలిటౌన్‌: తెనాలి డివిజనల్‌ పంచాయతీ అధికారిణి(డీఎల్‌పీఓ) వి.స్వరూపారాణిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా పరిషత్‌ సీఈఓ వి.జ్యోతిబసు బుధవారం సాయంత్రం తెనాలిలోని డీఎల్‌పీఓ కార్యాలయానికి వచ్చారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. ఆరోపణలకు సంబంధించిన అంశాలపై స్వరూపారాణిని విచారించారు. రూరల్‌ మండలం నందివెలుగుకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త బొప్పన సురేంద్ర చేసిన ఫిర్యాదులపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం విచారణ చేపట్టారు. వీరితో జిల్లా పరిషత్‌ కార్యాలయ పరిపాలన అధికారి జె.పూర్ణచంద్రారెడ్డి కూడా ఉన్నారు.

పిడుగురాళ్ల రూరల్‌: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, హాస్పిటల్‌ను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఇన్‌స్పెక్టర్ల బృందం బుధవారం సందర్శించింది. ఓపీ విభాగం, జనరల్‌ వార్డు, ల్యాబ్‌, గైనిక్‌ వార్డు, మెడికల్‌ కళాశాలలోని అనాటమీ, బయోకెమిరిస్టీ, ఫిజియాలజీ, తదితర వార్డులు పరిశీలించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఇన్‌స్పెక్టర్‌ల బృందం మాట్లాడుతూ కళాశాల 80 శాతం పూర్తయిందని, జూలై 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోవిందు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement