గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టులో నూతన న్యాయమూర్తులకు ఘన సత్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా న్యాయస్థానాలలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తుల స్వాగత కార్యక్రమం బుధవారం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లావు నాగేశ్వరరావు హాలులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు ఎస్.కె. సికిందర్ బాషా (ఫ్యామిలీ కోర్టు), వి. శ్రీనివాసరావు (నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి), జి.దీనబాబు (నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి), డి. విజయసారథి రాజు (అదనపు ఫ్యామిలీ కోర్టు), ఎ. సునీతా రాణి (అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు), సి. రమణారెడ్డి (నాలుగో అదనపు సబ్ కోర్టు), రాజశేఖర్ (పీడీఎం కోర్టు), వి. రఘునాథ్ (మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు), ఎల్.అంజయ్య (రైల్వే కోర్టు)లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... న్యాయమూర్తులు– న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు అవసరం అన్నారు. పరస్పర గౌరవంతో ఇవి కొనసాగినప్పుడే కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. న్యాయవాదుల వృత్తి నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టుల నిర్వహణను క్రమశిక్షణతో, పారదర్శకంగా కొనసాగిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదులు కూడా తమ వృత్తి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు వీర మణీంద్ర, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


