కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు జిల్లాలో 117 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) భారీ నష్టాల్లో కూరుకుపోయాయని, ఉద్యోగులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీబీ) చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వెల్లడించారు. బుధవారం బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలన భవనంలో జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సంఘాల సిబ్బందికి వేతనాల నిమిత్తం సహకార బ్యాంకు, ఆప్కాబ్ సంయుక్తంగా డీఎల్‌ఎస్‌ఏ ఫండ్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వనుందని వెల్లడించారు. రానున్న మూడేళ్లలో ఆయా సొసైటీల అధ్యక్షులు, సీఈఓలు సంఘాలను బలోపేతం చేసుకునే దిశగా కృషి చేయాలని, లేకుంటే సంఘాల మనుగడ కష్టమని స్పష్టం చేశారు. హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ ఆడిట్ పూర్తి కావడంతో నివేదికను మహాజన సభ ఆమోదం తెలిపింది. సమావేశంలో జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, బ్యాంక్ సీఈఓ వీవీఎస్ ఫణికుమార్, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ జేవీ సుబ్బారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా పీఏసీఎస్‌ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


