నగరంపాలెం: ‘ఆటో అద్దె డబ్బులు రూ.3 వేలు చెల్లించాలని యాజమాని, పోలీసులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని రోజులు నిండని శిశువుతో వచ్చిన భార్యాభర్త వాపోయారు. ఇద్దరి మధ్యలో ఉన్నందున, చెల్లించిన రూ.25 లక్షలు తిరిగి ఇవ్వాలని ఓ మహిళ ఇబ్బందులకు గురిచేస్తోందని మరో బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్‌ఎస్(గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కరించడంలో పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా విచారించి, న్యాయమైన పరిష్కారం చేయాలని సూచించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌న్‌లైన్ ద్వారా సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు తెలియకుండా ఎలాంటి ఫిర్యాదు మూసివేయద్దని స్పష్టం చేశారు. జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఏ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్)లు కూడా అర్జీలు స్వీకరించారు.


