మంగళగిరి టౌన్: నేడు మంగళగిరిలో జరిగే ఉప ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో నిర్వహించనున్న ‘అరణ్యరామం’ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపధ్యంలో కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టచర్యలు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఎఫ్‌ఓ హిమశైలజ తదితర అధికారులు పాల్గొన్నారు.
నేడు డిప్యూటీ సీఎం పర్యటన..
తాడేపల్లి రూరల్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుక్రవారం తాడేపల్లిలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ కన్వీనర్ తిరుపతిరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురం వద్ద రాష్ట్ర అటవీశాఖ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.


