అధికారం అండగా విర్రవీగుతున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల
వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోవడం ఖాయం
వెంటనే అన్నదాతలపై అక్రమ కేసులు రద్దు చేయాలి
సీజ్ చేసిన గోదామును రైతుకు అప్పగించాలి
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
రైతులకు సంఘీభావంగా చేపట్టిన ‘చలో మామిళ్లపల్లి’ విజయవంతం
ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీరుపై మాజీ మంత్రి అంబటి ధ్వజం
పొన్నూరు పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచుకుంటే దానిపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులైన టీడీపీ బడా నాయకులు దాడి చేయడం తగదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. షట్టరు పగలగొట్టి దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన పరిణామమని విమర్శించారు. ఈ నెల 5వ తేదీన రైతు సముద్రయ్య, ఆయన కోడలు త్రివేణిలకు చెందిన రేకుల షెడ్డుపై మామిళ్లపల్లిలో టీడీపీ నాయకుల దాడి చేయడం, రైతులపైనే అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బుధవారం జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో చలో మామిళ్లపల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. రేకుల షెడ్డును పరిశీలించారు. మహిళా రైతులు జరిగిన దాడి, అన్యాయాన్ని నాయకులకు వివరించారు. అనంతరం వేదికపై మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విలేకరులతో అంబటి రాంబాబు మాట్లాడుతూ... ‘‘ ప్రభుత్వం మీది కాబట్టి అక్రమం జరిగితే చర్యలు తీసుకోవాలి. కానీ దౌర్జన్యం చేయడమేంటి? ప్రశ్నించే వారు లేరని ఎమ్మెల్యే ధూళిపాళ్ల దౌర్జన్యం చేస్తున్నారు. ఏమిటీ దాడులు? నిన్న గోదాముపై, మొన్న మా ఆఫీస్‌పై, ఇంటిపై దాడి చేశారు. మా కుటుంబంపై, కులంపై, లేక మా పార్టీపై ప్రభుత్వం పగబట్టిందా? ఈ విషయం ఎమ్మెల్యే నరేంద్ర చెప్పాలి. గోడౌన్‌పై దాడి చేయడమే కాకుండా రైతులపైనే కేసులు పెట్టడమేంటి? మురళీకృష్ణపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి. మొక్కజొన్న వ్యాపారం చేసే అవసరం ఆయనకు ఉందా అని ప్రశ్నిస్తున్నా. అబద్ధాలు చెబితే అతికేలా ఉండాలి. అధికారం చేతిలో ఉందని విర్రవీగకూడదు. పదవి శాశ్వతం కాదు. గతంలో ఎన్నికల్లో ఓడిపోలేదా? అధికారులు చట్టప్రకారం నడుచుకోకపోతే మిమ్మల్ని కూడా నిలదీస్తాం. సర్వశ్రేష్ట త్రిపాఠి అనే ఐజీ మనకుండటం దురదృష్టకరమైన విషయం. ఆయన ఖాకీ దుస్తులు వేసుకోవడం మానేశారు. ఆయన ఒంటిపై ఎల్లప్పుడూ పచ్చ చొక్కానే కనిపిస్తుంది. ఈ డివిజన్‌ను సర్వం భ్రష్టు పట్టిస్తున్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం ఎవరూ భయపడొద్దు. వచ్చేది మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. చట్ట ప్రకారం అందర్నీ ప్రశ్నిద్దాం. ఎవరూ తప్పించుకోలేరు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే సహించేలేదు. ఈ సంఘటనపై ఐజీ విచారణ చేయించి... రైతులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి. సీజ్ చేసిన షెడ్డును రైతుకు అప్పగించాలి. మొక్కజొన్నకు ధర లేక రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తామని’’ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ నాజర్, ఆకుల వెంకటేశ్వరరావు, అమిరినేని సాంబశివరావు, అంబటి వెంకటేశ్వరరావు, టి.వేణుగోపాల్, చిర్రా అక్కిరెడ్డి, నల్లమోతు రవీంద్రబాబు, లంకపోతు పిచ్చిరెడ్డి, సీహెచ్ మురళి, మౌలాలి, దేవరకొంగ గోపి, గేరా సంజీవ్, మిక్కిలి జాన్, సాబాసు ఈశ్వరయ్య, రుద్రపాటి ఆదిశేషు, వట్టిప్రోలు రంగారావు, వీరయ్య, పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


