గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బుతో చేరి ఆపరేషన్లు చేయించుకోవాలంటే తప్పనిసరిగా రక్తాన్ని బయట కొనుక్కోవాల్సిందే. జీజీహెచ్‌లో బ్లడ్ బ్యాంకు ఉన్నప్పటికీ వైద్యులు ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయించడం విమర్శలకు తావిస్తోంది.
రూ. పది వేల వరకు ఖర్చు
గుండె బైపాస్ సర్జరీ చేసే రోగికి ఆరు బ్లడ్‌బ్యాగులు అవసరమవుతాయి. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకు నుంచి సుమారు దీనికోస రూ. 10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జీజీహెచ్‌లో బ్లడ్‌బ్యాంకు నుంచి రక్తాన్ని తెచ్చి వినియోగించేందుకు గుండె ఆపరేషన్ చేసే వైద్యులు (కార్డియో థొరాసిక్ సర్జరీ) సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక్కడి రక్తం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదని, ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయని, అందువల్లే బయట నుంచి కొనుగోలు చేయిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదే తరహాలో ఇతర విభాగాల్లోనూ బయట నుంచి రక్తం కొనుగోలు చేయిస్తే ఇక జీజీహెచ్‌లో ఉండి కూడా ఏం ప్రయోజనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు మాత్రం జీజీహెచ్ బ్లడ్‌బ్యాంకు నుంచి, ఆపరేషన్ చేయించుకుంటున్న రోగుల కుటుంబ సభ్యులు, బంధువుల రక్తదానం ద్వారా రక్తాన్ని సేకరించి రోగికి ఎక్కించి విజయవంతంగా ఆపరేషన్ చేస్తున్నారు.
ఆపరేషన్లు ఉచితమైనా....
గుండె బైపాస్ సర్జరీలు ప్రైవేటు ఆసుపత్రిలో పేదలు చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ కొంత మంది డాక్టర్లు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరు జీజీహెచ్‌కు రోగులు వస్తున్నారు. కార్డియోథొరాసిక్ సర్జరీ (సీటీఎస్) వైద్యులు ఇటీవల 225 గుండె ఆపరేషన్లు పూర్తి చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు రూ. 5 లక్షలకుపైగా ఖరీదు చేసే గుండె బైపాస్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. సీటీఎస్ వైద్య విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ప్రత్యేకంగా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం కొనుగోలు చేయించి తెప్పించే విధులు నిర్వహిస్తున్నాడు. వైద్యుల ఆదేశాల మేరకు ఇలా చేయాలని సూచిస్తున్నట్లు సదరు ఉద్యోగి తెలిపారు. ఏడాదికిపైగా ఇలా బయట కొనుగోలు చేయించడపై విమర్శలు వస్తున్నాయి.
బ్లడ్‌బ్యాంకు తీరుపై విమర్శలు
జీజీహెచ్ బ్లడ్‌బ్యాంకులో రక్తాన్ని తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నట్లు గుండె ఆపరేషన్ వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. రక్తంతోపాటు ప్లాస్మా, ప్లేట్‌లెట్స్, ఇతర కాంపోనెంట్స్ కూడా గుండె ఆపరేషన్ చేయించుకునేవారికి అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. రక్తంతోపాటు ఇతర బ్లడ్ కాంపోనెంట్స్ ఆపరేషన్ చేసే రోగులకు ఎక్కించాల్సి వస్తే సదరు ఖర్చు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు, అంతకు మించి పెరగవచ్చు. ఇంత భారం పేద రోగులపై మోపేందుకు గుండె ఆపరేషన్‌ల వైద్యులు ఏమాత్రం వెనుకాడడం లేదు.


