గుంటూరులో నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఉత్తేజ్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగపు నగర అధ్యక్షుడు బాలు పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ బుధవారం గుంటూరు లాడ్జి కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. బాలుపై గతేడాది అక్రమంగా లిక్కర్ కేసు బనాయించారని, వాయిదా నిమిత్తం కర్నూలు వచ్చిన అతన్ని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇదే పద్ధతిని అవలంబిస్తే 2029లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.


