పది రోజుల్లోగా సర్టిఫికెట్లు
‘సదరం’లోనూ సాగదీత సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం పరీక్షలు పూర్తయినా మంజూరు చేయని సర్కారు ఫిబ్రవరి నెలాఖరు నుంచి నిలిచిన ద్రువపత్రాల జారీ పింఛన్లు, ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందలేక దివ్యాంగుల అవస్థలు
ప్రత్తిపాడు: సదరం సర్టిఫికెట్.. వాస్తవానికి ఇది ఒక సాధారణ పత్రం కాదు. దివ్యాంగుల జీవనాధారానికి సంబంధించిన ముఖ్యమైన ధ్రువీకరణ. ప్రమాదాల బారిన పడి అవయవాలను కోల్పోయిన అభాగ్యులకు, పుట్టకతోనే అవయవ లోపంతో బాధపడుతున్న మరెందరో విధివంచితులకు కీలకమైన ధ్రువీకరణ పత్రం మంజూరుకు చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తుంది. దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ అనంతరం ‘సదరం’ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా సదరం స్లాట్లు బుక్ చేసుకుని వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న వందల మంది దివ్యాంగులు సుమారు మూడు నెలలుగా సర్టిఫికెట్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తుంది.
కొత్త సాఫ్ట్‌వేర్ అంటూ..
సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు చంద్రబాబు సర్కారు ఈ ఏడాది జనవరిలో పాత సాఫ్ట్‌వేర్ స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. ఫిబ్రవరి మధ్య నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ అమల్లోనికి వచ్చింది. అప్పటి వరకూ ఉన్న సర్టిఫికెట్లను క్లియర్ చేసినప్పటికీ.. ఆ తర్వాత నుంచి సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యల వలన ఫిబ్రవరి నెలాఖరు నుంచి సర్టిఫికెట్‌ల జారీ నిలిచిపోయింది. దీంతో సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ రాకపోతుండంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా కార్యాలయాలు, స్వర్ణ సచివాలయాల చుట్టూ సర్టిఫికెట్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
వందల మంది ఎదురుచూపులు..
గుంటూరు జిల్లాలో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రిలో, తెనాలి డీహెచ్ ఆస్పత్రి, ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి సోమవారం సదరం క్యాంపులు నిర్వహిస్తారు. దివ్యాంగులు ముందుగా వారికి ఉన్న సమస్యకు సంబంధించి ఏ ఆస్పత్రిలో వైకల్య నిర్ధారణ పరీక్ష ఉందో చూసుకుని ఆ ఆస్పత్రిలో స్లాట్ బుక్ చేసుకుంటారు. అక్కడ వైద్యాధికారులు పరీక్ష అనంతరం పర్సంటేజీ నిర్ధారించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీటిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. కానీ కొత్త సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ సమస్యల వలన పరీక్షలు పూర్తయి నెలలు గడుస్తున్నా ’పెండింగ్ ఎట్ హాస్పిటల్ లెవల్’ అని స్టేటస్ చూపిస్తుందని అటు దివ్యాంగులు, ఇటు స్వర్ణ సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో శారీరక వైకల్యం, వినికిడి లోపం, మానసిక వికలాంగత్వం, దృష్టి లోపం ఉన్న దివ్యాంగులు సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ సమస్య రాష్టవ్య్రాప్తంగా ఉన్నట్లు తెలుస్తుంది.
సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం..
సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో దివ్యాంగులు పింఛన్లు, విద్యా రాయితీలు, రైల్వే కన్సెషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు, ఆరోగ్య, ప్రభుత్వ పథకాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దివ్యాంగులు పింఛను పొందాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్‌ల జారీ నిలిచిపోవడంతో అర్హత ఉన్నా పింఛను పొందలేని దుస్థితి చోటుచేసుకుంది. సర్టిఫికెట్ కోసం బాధితులు జిల్లా ఆసుపత్రులు, డీఆర్డీఏ కార్యాలయాలు, స్వర్ణ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో, చివరికి పీజీఆర్‌ఎస్‌ల బాట పడుతున్నారు.
కొత్త సాఫ్ట్ వేర్‌లో ఉన్న సాంకేతిక సమస్యల వలన ఫిబ్రవరి నెలాఖరు నుంచి సదరం సర్టిఫికెట్ల జారీలో కొంత జాప్యం జరిగింది. మరో పది రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఆ తరువాత ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసుకున్న దివ్యాంగులు ఆన్‌లైన్ ద్వారా తమ సదరం సర్టిఫికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
–డాక్టర్ బి.వి.రంగారావు,
డీసీహెచ్‌ఎస్, గుంటూరు జిల్లా
గుంటూరు జీజీహెచ్ 908
డీహెచ్ తెనాలి 436
సీహెచ్‌సీ ప్రత్తిపాడు 183
మొత్తం 1,527
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి జిల్లాలో సదరం పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు ఆస్పత్రుల వారీగా..


