పోక్సో కేసులో పలువురికి జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో పలువురికి జైలు

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

పోక్సో కేసులో పలువురికి జైలు 32 మంది ఫార్మసీ అధికారులకు నియామక ఉత్తర్వులు డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ శ్రీనివాసులు

తెనాలిరూరల్‌: బాలికతో పరిచయం ఏర్పరచుకుని అర్ధ నగ్నంగా వీడియోకాల్‌ చేయించి రికార్డు చేసి బెదిరించిన కేసులో యువకుడితోపాటు అతని తల్లిదండ్రలకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు వివరాలు.. పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలికతో 2022లో హైదరాబాద్‌లో ఉండే వరసకు బాబాయి గండికోట గోపికుమార్‌ పరిచయం పెంచుకున్నాడు. తరచూ బాలికకు ఫోన్‌ చేస్తూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో బాలికతో అర్ధ నగ్నంగా వీడియో కాల్‌ చేయించుకుని కాల్‌ను రికార్డు చేశాడు. వీడియో కాల్‌ వ్యవహారం బాలిక తల్లికి తెలియడంతో బాలికను మందలించింది. బాలిక గోపికుమార్‌తో ఫోన్‌ మాట్లాడడం మానేయడంతో తెనాలి వచ్చి బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని కోరగా ఆమె మందలించింది. తనకు ఇచ్చి వివాహం చేయకపోతే బంధువుల ఇళ్లకు వెళ్లి వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. అతని తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, సాంబయ్య పెళ్లి చేయకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా అప్పటి వన్‌ టౌన్‌ ఎస్‌ఐ కె.చాణక్య పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. కేసు బుధవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి ఐ.ఇందిరాప్రియదర్శిని, ప్రధాన నిందితుడు గోపికుమార్‌కు మూడేళ్ల జైలు శిక్ష, అతడి తల్లిదండ్రులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ముగ్గురికి రూ.55 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పోక్సో కోర్టు స్పెషల్‌ప్రాసిక్యూటర్‌ వెలినేని రాఘవయ్య వాదించారు.

గుంటూరు మెడికల్‌: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మసీ ఆఫీసర్స్‌గా పనిచేసేందుకు జనవరిలో గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ జి.శోభరాణి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో ఫార్మసీ అధికారులు పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్‌ మెరిట్‌ లిస్టు ఖరారు చేసి బుధవారం గుంటూరు ఆర్డీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తొలుత అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన చేసి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆర్డీ కార్యాలయం పరిధిలో 36 ఫార్మసీ అధికారుల పోస్టులకు అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలువగా 32 మంది ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. నలుగురు అభ్యర్థులు లిఖిత పూర్వకంగా ఉద్యోగాలు వద్దని రాసి ఇచ్చారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శోభారాణి, డెప్యూటీ డైరెక్టర్‌ బండి పాల్‌సుధాకర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు.

గుంటూరు మెడికల్‌: గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇజాజ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్‌ గుడిసె చంద్రశేఖర్‌, కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా డాక్టర్‌ ఇంజేటి బాబ్జిశ్యామ్‌కుమార్‌ వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ స్వరూప్‌కాంత్‌, డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement