విజయకీలాద్రిపై హనుమజ్జయంతి | - | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై హనుమజ్జయంతి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

విజయకీలాద్రిపై హనుమజ్జయంతి సూర్యలంకలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ కుడో పోటీలకు సిద్ధార్థ క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి సాగర్‌ నీటిమట్టం వివరాలు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్‌ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.

బాపట్ల: సూర్యలంక బీచ్‌లో స్వదేశ్‌ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్‌ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్‌ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ అన్‌ఎక్విప్డ్‌ ఓపెన్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ అభినందించారు. ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్‌.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్‌కుమార్‌ రజత పతకం గెలుపొందారు. కోచ్‌ ఖమురుద్దీన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్‌ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement