రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకం రోగికి డాక్టర్‌కు అనుసంధానంగా పనిచేసేది నర్సులే.. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటూరులో ప్రపంచ నర్సుల దినోత్సవం పలువురు నర్సులకు అవార్డులు అందజేత
గుంటూరు మెడికల్: నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, రోగి వ్యాధి నుంచి కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ విజయవాడ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబంలో సోదరి ఏవిధంగా ఇతర కుటుంబ సభ్యులను ఆదరించి ప్రేమగా చూస్తుందో అదే తరహాలో సిస్టర్స్‌గా పిలువబడే నర్సులు సైతం చికిత్స కోసం వచ్చే రోగులను ప్రేమగా ఆదరించి వ్యాధి నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. లక్షలాది మంది రోగుల కేర్ తీసుకునే నర్సింగ్ సిబ్బంది వృత్తిలో సేవాభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. యుద్ధంలో నిస్వార్థంగా సేవలందించిన ప్లారెన్స్ నైటింగేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వృత్తి పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలన్నారు. వ్యాధి బాధలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సు గైడ్, ఎడ్యుకేటర్, మెంటార్‌గా వ్యవహరిస్తూ తన చేతులతో మ్యాజిక్ చేసి వ్యాధి నుంచి కోలుకుని నవ్వుతూ రోగి ఇంటికి వెళ్లేలా చేస్తారన్నారు. నర్సులు దేశ,విదేశాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రభుత్వం నర్సింగ్ సిబ్బంది నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. అందులో భాగంగా గత ఏడాది విజయవాడలో నర్సింగ్ సిబ్బందికి అవార్డులు అందజేశామని, నేడు గుంటూరులో అవార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు. నర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నర్సింగ్ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అవార్డులు అందజేశారు. ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డులను సోమలపూరి చిన్నమ్మి, కొత్తమిద్దె సావిత్రి, డాక్టర్ వనజకుమారి, డాక్టర్ కంద స్వామి సుగంది, ప్రొఫెసర్ సి.ఆర్.షంషీర్ బేగంలు అందుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డీఎంఈ డాక్టర్ వి.రాధికారెడ్డి, ఏపీ నర్సెస్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, పలు జిల్లాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


