క్వాంటం కంప్యూటర్‌ను సందర్శించిన మంత్రి | - | Sakshi
Sakshi News home page

క్వాంటం కంప్యూటర్‌ను సందర్శించిన మంత్రి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

క్వాంటం కంప్యూటర్‌ను సందర్శించిన మంత్రి తెనాలి శిల్పశాలలో భారీ అగ్ని ప్రమాదం సెలవుల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదు అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మంగళగిరి టౌన్‌: మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సందర్శించారు. ఈ మేరకు ఇటీవల వర్సిటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన క్వాంటం కంప్యూటర్‌ సర్వీస్‌ సెంటర్‌ను పరిశీలించారు. వర్సిటీ అధికారులను కలసి క్వాంటం కంప్యూటర్‌ వివరాలను తెలుసుకున్నారు. క్వాంటం కంప్యూటర్ల పనితీరు, ఏ ఏ రంగాల్లో కంపోనెంట్లు తయారీ, వాటి ప్రాముఖ్యతల గురించి ఏపీ క్వాంటం మిషన్‌ డైరెక్టర్‌ సివి శ్రీధర్‌ మంత్రికి వివరించారు. ప్రపంచ దేశాల్లో క్వాంటం కంప్యూటర్లకు పెరుగుతున్న ఆదరణ గురించి తెలిపారు. అనంతరం వర్శిటీలోని పలు ల్యాబొరేటరీలను సందర్శించారు. కార్యక్రమంలో వర్శిటీ వీసీ ఆచార్య సీహెచ్‌ సతీష్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వినాయక్‌, క్వాంటం డీన్‌ డాక్టర్‌ సోమనాధ్‌, ప్రొఫెసర్‌ వర్ష తదితరులు పాల్గొన్నారు.

తెనాలిరూరల్‌: తెనాలిలో ఓ శిల్పశాలలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి నిజాంపట్నం కాల్వకట్ట వద్దగల ఓ శిల్పశాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శిల్పశాలలోని ఫైబర్‌ విగ్రహాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి నల్లటి దట్టమైన పొగతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు స్పందించి విగ్రహాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా శకటం తెనాలిలో అందుబాటులో లేదని, మంగళగిరి నుంచి తెప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. నిజాంపట్నం కాల్వ నుండి బకెట్‌లతో నీళ్లు తోడి స్థానికులు, శిల్పశాల యజమానులు, వర్కర్లు మంటలను ఆర్పేందుకు ప్రయల్నించారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిదని చెబుతున్నారు.

యూటీఎఫ్‌ పల్నాడు

జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు

నరసరావుపేట ఈస్ట్‌: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రెమిడీయల్‌ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్‌ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్‌లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్‌ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్‌ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్‌ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ సైదాబీ(39) చాగంటివారిపాలేనికి చెందిన రుద్రపాటి చంద్రశేఖర్‌ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్న సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్‌, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్‌ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెందింది. చంద్రశేఖర్‌కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement