రేపు చలో మామిళ్లపల్లి | - | Sakshi
Sakshi News home page

రేపు చలో మామిళ్లపల్లి

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

రైతులు నిల్వ చేసిన మొక్కజొన్న గోదాముపై టీడీపీ గూండాల దాడి హేయమైన చర్య ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో దాడికి పాల్పడిన టీడీపీ గూండాలు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే పోలీసు, రెవెన్యూ అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది మొక్కజొన్న క్వింటా రూ. 2,400 చొప్పున కొనుగోలు చేయాలి వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

దుష్ఫ్రచారంతో అభాసుపాలైన ధూళిపాళ్ల

గుంటూరు ఎడ్యుకేషన్‌: పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ గూండాలతో చేయించిన దాడితో బాధితులైన రైతులను పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 13న ఛలో మామిళ్లపల్లి పేరుతో రైతు పరామర్శ యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా పొన్నూరు నియోజకవర్గంలో 40వేల ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చిందని, కేంద్రం ప్రకటించిన విధంగా క్వింటా రూ.2,400 మద్దతు చొప్పున పంటను కొనుగోలు చేయాలని రైతుల పక్షాన నిలిచి వైఎస్సార్‌ సీపీ ఉద్యమం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద వందలాది మంది రైతులతో కలిసి, వైఎస్సార్‌ సీపీ చేపట్టిన మొక్కజొన్న పోరాటదీక్షకు వచ్చిన స్పందన ప్రభావంతోనే సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. అయితే రైతాంగం ఎదురు చూస్తున్న విధంగా కొనుగోలు కేంద్రాలను తెరవలేదని, దీంతో చేతికి వచ్చిన పంటను అమ్ముకునే అవకాశం లేకుండా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో పెద్ద దళారీగా మారిన ఎమ్మెల్యే నరేంద్ర సంగం డెయిరీలో పశువుల దాణా ఉత్పత్తి కోసం మద్దతు ధర కంటే తక్కువకు రూ.2,100లకు పంటను కొనుగోలు చేసినట్లుగా స్వయంగా అంగీకరించారన్నారు. దీంతో పాటు తన అనుచరులతో రైతుల నుంచి క్వింటా రూ.1,600కు కొనుగోలు చేయిస్తూ రైతులను తీవ్రంగా మోసగిస్తున్నారని ఆరోపించారు.

అధికారులు తీరు మార్చుకోవాలి

మామిళ్లపల్లి, మంచాల, వెల్లలూరు గ్రామాల్లో తనకు ఆధిక్యం ఉన్న చోట కాపులను అణిచివేయాలని పన్నిన కుట్రలో భాగంగానూ ఎమ్మెల్యే నరేంద్ర ఈ వ్యవహారాన్ని నడిసిస్తున్నారన్నారు. సెలవు రోజు వచ్చి గోదాముకు సీల్‌ వేసిన తహసీల్దార్‌, అందుకు శాంతిభద్రతల సమస్య ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేను సంతృప్తి పర్చడం కోసం గోదాముకు తాళం వేశారన్నారు. ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర సేవలో తరిస్తూ, చట్టాన్ని అతిక్రమిస్తున్న పొన్నూరు, చేబ్రోలు రూరల్‌ సీఐలు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. మొక్కజొన్న గిట్టుబాటు ధర కల్పనతోనే ఉద్యమం ఆగదని, గుంటూరు ఛానెల్‌, కొమ్మమూరు బ్రిడ్జిపై ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు.

రైతులకు అండగా నిలుస్తాం

రైతులకు అండగా నిలవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈనెల 13న ఛలో మామిళ్లపల్లి – రైతు పరామర్శ యాత్రలో వైఎస్సార్‌ సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో కలసి రైతులను పరామర్శించి, మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్‌, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పెనుమాల అరుణ్‌కుమార్‌, పొన్నూరు నియోజకవర్గ నాయకుడు తురిమెళ శ్రీనివాసరావు, చాగంటి మురళీమోహన్‌, బద్దెపూడి రమేష్‌, చింతలపూడి మురళీకృష్ణ, లంకపోతు పిచ్చెయ్య, చిర్రా అంకిరెడ్డి, గోళ్ల జ్యోతి పాల్గొన్నారు.

మామిళ్లపల్లి గ్రామంలో సూడా సముద్రయ్య కోడలు త్రివేణి పేరుతో ఉన్న గోదాములో రైతులు నిల్వ చేసుకున్న మొక్కజొన్న పంటను అంబటి మురళీకృష్ణ దాచారంటూ తనకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే నరేంద్ర ప్రోద్బలంతో మామిళ్లపల్లితో సంబంధం లేని, బయట గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, గూండాలు గోదామును ధ్వంసం చేసి, అడ్డువచ్చిన రైతులపై దాడికి తెగబడ్డారని మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు మామిళ్లపల్లి గ్రామంలో ఎకరం పొలం లేదని, తాను మొక్కజొన్న పంట ఉత్పత్తి దారుడిని, కొనుగోలుదారుడిని సైతం కాదని స్పష్టం చేశారు.

మామిళ్లపల్లిలో జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను కలిసి వాస్తవాలను వారి దృష్టికి తీసుకువచ్చిన తరువాత 31 మంది టీడీపీ నాయకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, వారందరు మామిళ్లపల్లి గ్రామంతో సంబంధం లేని బయటి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులేనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement