గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం.
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు.
పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు.


