వైభవంగా హనుమాన్‌ గ్రామోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హనుమాన్‌ గ్రామోత్సవం

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

భారీగా తరలివచ్చిన దీక్షాపరులు నగర పురవీధుల్లో భారీ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్న ప్రదర్శనలు

పట్నంబజారు: అంజనీ సుతుడు ఆంజనేయస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. గుంటూరు నగరం నాజ్‌ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఆంజనేయ దీక్షాపరులు, భక్తులు భారీ ఊరేగింపు నడుమ ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్‌తో ఏర్పాటు చేసిన హనుమాన్‌ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, స్వామి వారి వేషధారణలు, డప్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాజ్‌ సెంటర్లో ప్రారంభమైన ఊరేగింపు భాస్కర్‌ డీలక్స్‌, కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌, శివాలయం, భగత్‌ సింగ్‌ బొమ్మ సెంటర్‌ మీదుగా లాలాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తిరిగి అక్కడ నుంచి హిమని కూల్‌ డ్రింక్‌ సెంటర్‌, జిన్నాటవర్‌ సెంటర్‌ మీదుగా తిరిగి ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుంది. అశేష భక్త సందోహం మధ్య జరిగిన ప్రదర్శన కార్యక్రమంలో నగర ప్రజలు స్వామివారినీ మనసారా స్మరించుకుంటూ నమస్కరించుకున్నారు. ఆలయ ఈవో టి సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్‌ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు టీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రూప్‌ ఆలయాల పాలకమండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఘటాభిషేకం

హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్‌సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిఏటా సాంప్రదాయంగా నిర్వహించే ఘటాభిషేకం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతోందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ, దీక్ష సమాజం సభ్యులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement