పట్నంబజారు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆర్టీఏ డీటీసీ కె.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సుల తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ క్షీణించడంపై సోమవారం ‘సాక్షి’లో ‘ఫిట్‌లెస్ బస్సు.. భద్రత తుస్సు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో పాఠశాలలకు చెందిన 284 బస్సులు తనిఖీ చేయగా భద్రతా ప్రమాణాలు సరిగా లేని 78 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సులు రోడ్డుపైకి వస్తే చర్యలు ఉంటాయన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు. లేని పక్షంలో బస్సులు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.


