పోలీసుల అదుపులో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

పెదకాకాని: ఇన్‌స్ట్రాగామ్‌లో స్థానిక ఎమ్మెల్యేపై పోస్ట్‌ చేశారనే ఆరోపణలతో వైఎస్సార్‌ సీపీ చేబ్రోలు మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌, చేబ్రోలు 4వ సెగ్మెంట్‌ ఎంపీటీసీ సభ్యుడు ఇంటూరి జైపాల్‌రెడ్డిని పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు మండలానికి చెందిన జైపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై అసభ్యకరమైన పోస్టు పెట్టారని పెదకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త దాసరి నరసింహారావు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్యకర్త ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం జైపాల్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌ మీడియా కన్వీనర్‌పై కేసు నమోదు చేసి ఉపయోగించిన రెండు ఫోన్‌లు, లాప్‌టాప్‌ సీజ్‌ చేసినట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. అలానే ఎమ్మెల్యేపై మొక్కజొన్న దొంగల గ్యాంగ్‌ లీడర్‌ నరేంద్ర, రైతులు రేటు లేదు దొంగలకు డబ్బుల ముద్ద అనే పోస్ట్‌లు పెట్టారని రామాంజనేయులు, వినోద్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

గుంటూరు లీగల్‌: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. పల్నాడు జిల్లా కోసూరు మండలం పెరికపాడుకు చెందిన మందా నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్నేహంగా ఉన్నాడు. నాగరాజు మద్యం తాగేందుకు అతడిని పిలవడంతో భార్య మందలించింది. నాగరాజు ఒంటరిగా మద్యం తాగాడు. అనంతరం రాత్రి సుమారు 12 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి, అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్‌.కె.షమీ పర్వీన్‌ సుల్తానా బేగం నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించారు. కేసు దర్యాప్తులో ఎస్‌ఐలు ఎం.నారాయణ, బి. అనంతకృష్ణ, కోర్టు కానిస్టేబుల్‌(ప్రస్తుతం ఏఎస్‌ఐ) శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీగల దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు.

విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌ అధికారుల విస్తృత తనిఖీలు

కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్‌ విభాగం, ఆపరేషన్‌ విభాగం సంయుక్తంగా గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్‌ సీహెచ్‌ రమేష్‌ ఆధ్వర్యంలో గుంటూరు డీ–1 సెక్షన్‌ పరిధిలోని బ్రాడీపేట, అరండల్‌పేటలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 4,750 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్‌ వాడుతున్న 108 మందికి రూ.5.05 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్‌ వాడుకుంటున్న ఐదుగురికి రూ.26 వేలు కలిపి మొత్తంగా రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఎస్‌ఏ కరీం, పఠాన్‌ హుస్సేన్‌ ఖాన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సర్వీసుల తనీఖీలు భారత విద్యుత్‌ చట్టానికి లోబడి ఉంటాయన్నారు. ఫిర్యాదుల కోసం 9440812263, 9440812361 నంబర్లును సంప్రదించాలని వారు కోరారు. తనిఖీల్లో డీఈఈలు షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌, మల్లికార్జున ప్రసాద్‌, రవికుమార్‌, ఏఈఈలు, కె.అక్కిరెడ్డి, శివశంకర్‌, సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఏఎన్‌యూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏఎన్‌యూ సోషియాలజీ సోషల్‌ వర్క్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సరస్వతి రాజు అయ్యర్‌, జెండర్‌ అసోసియేషన్‌ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ వారి గ్లోబల్‌ రోస్టర్‌ ఆఫ్‌ జెండర్‌ ఎక్స్‌పర్ట్‌గా ఎంపికయ్యారు. ఆ సంస్థ యొక్క డైరెక్టర్లు, వ్యవస్థాపకులైన నికోలా, లీ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.గంగాధరరావు సోమవారం ప్రొఫెసర్‌ సరస్వతి రాజు అయ్యర్‌ను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement