నగరంపాలెం: ఈ ఏడాది మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాట ధర లభించలేదు. దీంతో మొక్కజొన్న బస్తాలను తెలిసిన రైతు గోదాములో నిల్వ చేసుకున్నాం. అయితే వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు సంబంధించి గోదాము మంటూ సీజ్ చేశారు. వారం రోజులుగా అన్నం లేదని, మా మొరను ప్రభుత్వమైనా అలకించాలని పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు విన్నవించారు. సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్(గ్రీవెన్స్)లో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలసి జిల్లా ఏఎస్పీ(పరిపాలన) జీవీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. షెడ్‌కు వేసిన సీజ్‌ను తొలగించి, ఆరుగాలం పండించిన మొక్కజొన్న, వ్యవసాయ సామగ్రిని ఇప్పించాలని కోరారు.
ఎమ్మెల్యే దాడి చేయించారు...
పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని, దీంతో షెడ్‌లో మొక్కజొన్నను నిల్వ చేసుకున్నామని చెప్పారు. అయితే ఆ షెడ్ వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు చెందిందని ప్రచారం చేశారని వివరించారు. ఈ క్రమంలో పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కొంతమందిని పంపించి తమపై దాడి చేయించారని వాపోయారు. రైతులు అందరూ కన్నీరు పెడుతున్న ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ షెడ్‌ను పగులకొట్టారని అన్నారు. షెడ్ సూద సముద్రయ్యదని, అంబటి మురళీకృష్ణది కానేకాదని స్పష్టం చేశారు.
షెడ్ యాజమాని, రైతు సూద సముద్రయ్య మాట్లాడుతూ మేం ఎప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలేదని, వారం రోజులుగా అన్నంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మా మొరను కూటమి ప్రభుత్వం అలకించడలేదన్నారు. నాలుగు ఎకరాల పొలం ఉందని, అయితే షెడ్‌లో 320 టిక్కిలు ఉన్నాయని తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కూడా న్యాయం చేయడం లేదని వాపోయారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని, దౌర్జన్యంగా పగులకొట్టారని వాపోయారు. అందులో వ్యవసాయ పనిముట్లు ఉన్నాయని చెప్పినా ఆలకించలేదన్నారు. ఎమ్మెల్యే నరేంద్రకు ముఫ్‌పై ఏళ్లుగా సేవ చేశానని, ప్రస్తుతం నా సోదరులు టీడీపీలోనే ఉన్నారని అన్నారు. మొక్కజొన్న రైతు సూరిశెట్టి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సుమారు 500 మంది వచ్చి షెడ్‌ను పగులకొట్టారని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి మా ధాన్యం ఇప్పించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. రైతులపై అన్యాయంగా బనాయించిన కేసులను తొలగించాలని కోరారు. మొక్కజొన్న రైతులు ఇక్కుర్తి శ్రీనివాస్, అంబటి పోలీస్ పాల్గొన్నారు.


