గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ అంథోని గంజాయి విక్రయిస్తున్న సమయంలో మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. కేసులో ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోకవాణి వాదనలు వినిపించారు.
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్‌ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ పాల్గొన్నారు.


