గుంటూరు ఎడ్యుకేషన్ : ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవులు ఇవ్వడంతో సేద తీరుతున్నారు. పుస్తకాలకు దూరంగా చదువుకు కాస్త విరామం ఇస్తూ ఆట, పాటలతో సరదాగా గడుపుతున్నారు. ఏడాది పొడవునా చదువుల పేరుతో పోటీపడుతూ విసుగెత్తిపోయిన విద్యార్థులకు ఆటవిడుపు అందించేందుకు నగరంలోని వివిధ పాఠశాలలు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు వినూత్నమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. క్రీడాంశాల్లో శిక్షణ కల్పించడంతో పాటు చిత్రలేఖనం, పెయింటింగ్, వ్యర్థాలతో అందమైన వస్తువుల తయారీ, స్కేటింగ్, చెస్, నృత్యం, సంగీతం, యోగా, తోలుబొమ్మలాట, అష్టాచెమ్మా, ఏడు పెంకులాట వంటి ప్రాచీన క్రీడలు, ఆటల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా క్రీడలతోపాటు ఆటలు, సృజనాత్మక నైపుణ్యాలకు పదునుపెట్టే ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, యెగా వంటి అంశాల్లో శిక్షణ పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
● చిత్రలేఖనంలో శిక్షణ కల్పించడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందిందిచేందుకు వీలుంది. కలర్ పేపర్లతో డెకరేషన్ వస్తువుల తయారీ శిక్షణపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్ శిక్షణతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత, చేపట్టిన పనిపై శ్రద్దాసక్తులను ప్రేరేపించగలం. సబ్జెక్టుల వారీగా ప్రాజెక్టులను తయారు చేయడంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు అలవడతాయి.
● వ్యర్థాలతో అందమైన కళాకృతులతోపాటు గృహాలంకరణ వస్తువుల తయారీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. టిష్యూ పేపర్లు, స్ట్రాలు, కూల్‌డ్రింక్ సీసాల మూతలతో అందమైన వస్తువులను తయారీ చేయించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీస్తున్నారు.
● యోగా, ప్రాణాయామం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. విద్యార్థులు యోగా, ప్రాణాయామాన్ని సాధన చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వృద్ధి చెందుతాయి. పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాల్లో యోగాతో పాటు క్రీడలు, ఆట, పాటలతో సేదతీరుతున్నారు.
● విద్యార్థుల్లో దాగిన అభిరుచికి అనుగుణంగా కీబోర్డ్, డ్రమ్స్ వాయిద్యాలపై శిక్షణ ఇస్తున్నాం. తద్వారా మేధస్సు అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో సంగీతంపై ఇష్టాన్ని పెంచుకుని ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఏర్పడతాయి. సంగీత సాధన ద్వారా మానసిక ప్రశాంతత చేకూరి, ఒత్తిడి దూరమవుతుంది. చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు సంగీత శిక్షణ దోహదం చేస్తుంది.
● చదువుల ఒత్తిడి నుంచి
విద్యార్థులకు ఉపశమనం
● క్రీడలు, ఆటలతోపాటు సృజనాత్మక
నైపుణ్యాలను వెలికితీసే విధంగా శిక్షణ
● నగరంలోని వివిధ పాఠశాలల్లో
కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులు
● ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు
● ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు