రైతులకు షాక్‌ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే సోదరుడు | - | Sakshi
Sakshi News home page

రైతులకు షాక్‌ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే సోదరుడు

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

రైతులకు షాక్‌ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే సోదరుడు

తాడేపల్లి రూరల్‌: గత పది సంవత్సరాల నుంచి 120 మంది రైతులకు చెందిన 92 ఎకరాల భూములను డెవలప్‌మెంట్‌ చేస్తామంటూ నమ్మించి అగ్రిమెంట్‌ చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్న టీడీపీ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ భూములు ఇచ్చిన రైతులతో పాటు మిగిలిన వారికి ఆదివారం షాక్‌ ఇచ్చాడు. 92 ఎకరాల భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు మంత్రి లోకేశ్‌ను మీడియా ముఖంగా కోరారు. ఆ మరుసటి రోజే రైతులకు షాక్‌ ఇస్తూ మంగళగిరి తాడేపల్లి జాతీయ రహదారి వెంబడి నుంచి ఉన్న సర్కార్‌ డొంకను ఆక్రమించుకుని ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా రోడ్డు చుట్టూ రేకులు ఏర్పాటు చేసేందుకు లారీల్లో రేకులు తెచ్చి ఐఓసీ వెనుక దించారు. ఇది గమనించిన 92 ఎకరాల రైతులతో పాటు ప్రస్తుతం అక్కడ పొలాలు ఉన్న రైతులు వచ్చి రేకులు ఏర్పాటు చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వ డొంక అని, ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని రైతులు వారితో వాగ్వివాదానికి దిగారు. ‘మాకు తెలియదు.. సార్‌ ఇక్కడ దించమన్నారు’ అని చెప్పగా.. ఆ సార్‌ ఎవరో చెప్పాలని రైతులు ప్రశ్నించినా.. రేకులు దించి వెళ్లిపోయారు. గతంలో ఎమ్మెల్యే రామకృష్ణ సోదరుడు రైల్వే డంప్‌ యార్డ్‌ దగ్గర నుంచి పంట పొలాల మీదుగా ఉన్న సుమారు రెండు ఎకరాల డొంక భూమిని కూడా ప్రభుత్వం నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ డొంకను అమ్మే ఆలోచనను పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ రోడ్డును వారికి అమ్మితే ఎలా అని నిలదీసినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా రైతులను పంట పొలాల్లోకి వెళ్లనీయకుండా రోడ్డును ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం వెనుక అధికారులు ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్లుగా భూములను

డెవలప్‌మెంట్‌కు తీసుకుని

చేయకుండా వేధిస్తున్న వైనం

ఇప్పుడు ఆ భూములతో పాటు

వ్యవసాయ పొలాల్లోకి వెళ్లకుండా

రోడ్డు ఆక్రమించుకునేందుకు యత్నం

అడ్డుకున్న అన్నదాతలు..

న్యాయం చేయాలని వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement