లక్ష్మీపురం: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జూన్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, ప్రజాస్వామ్య పరిరక్షణ, శ్రమజీవుల హక్కులు, విద్య– ఉపాధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి కీలక అంశాలపై బోధనలు, చర్చలు ఉంటాయని వివరించారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. ఫీజుల పెంపు, నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాల లేమి, కాంట్రాక్టు ఉద్యోగుల అనిశ్చితి వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, విద్యుత్ చార్జీల భారాలు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి యువతపై మరింత ప్రభావం చూపుతోందని తెలిపారు. యువతను ఉద్యమ దిశగా తీసుకువెళ్లడం, వారి సమస్యలకు సంఘటిత పోరాటం నిర్మించడం ఈ శిక్షణ తరగతుల ముఖ్య లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.సుభాని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, వలి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువజన సమాఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.యశ్వంత్, అరుణ్, సద్దాం, మహేష్ పాల్గొన్నారు.


