నగరంపాలెం: సోషల్ మీడియాలో మతవిద్వేషపూరిత పోస్టులు, వదంతులు వ్యాప్తి చేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఘటనల దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్/ ఇతర సాషల్ మీడియా వేదికల్లో మతపరమైన ద్వేషపూరిత సందేశాలు, ఛాయచిత్రాలు, వీడియోలు లేదా రెచ్చగొట్టే కంటెంట్‌ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. గ్రూప్ అడ్మిన్‌న్‌లు ఆయా గ్రూప్‌ల్లో షేర్ చేసే ప్రతి సందేశం(మెసేజ్) నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఏవైనా ద్వేషపూరిత, అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్ ఉంటే వెంటనే ఆ సందేశాలను తొలగించి, సంబంధిత వ్యక్తులను గ్రూప్‌ల నుంచి తొలగించాలని సూచించారు. గ్రూప్ అడ్మిన్‌లు బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరారు. ప్రతి గ్రూప్ అడ్మిన్ తమ గ్రూప్‌ల్లో చట్టవిరుద్ధమైన ప్రచారం కాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. తప్పుడు ప్రచారం, మతద్వేషపూరిత పోస్టులు, నకిలీ వార్తలు, మార్ఫింగ్ ఫొటోలు లేదా వీడియోలను సృష్టించే, ఫార్వార్డ్ చేసే లేదా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏ సోషల్ మీడియా వేదికలైనా సరే వదంతులను వ్యాప్తి చేయవద్దుని అన్నారు. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు లేదా ఫార్వార్డ్ చేసేటప్పుడు సంబంధిత అధికారులు ద్వారా లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా వాస్తవాలు ధ్రువీకరించుకోవా లన్నారు. ఎవరైనా వదంతులు, మతద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా ఎస్పీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దృష్టికి ప్రజలు తేవాలన్నారు. అటువంటి వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


