ఆంధ్రనాట్యం భారతీయ సాంస్కృతిక వైభవ చిహ్నం | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రనాట్యం భారతీయ సాంస్కృతిక వైభవ చిహ్నం

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

ఏఎన్‌యూ(పెదకాకాని): భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అత్యాద్భుతంగా ఆవిష్కరించే నాట్యరీతుల్లో ఆంధ్రనాట్యం ఒకటని ఏఎన్‌యూ రెక్టార్‌ ఆచార్య రామినేని శివరాంప్రసాద్‌ అన్నారు. శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పంచశత ఆంధ్రనాట్య సంగమం పేరుతో 500 మంది ఆంధ్రనాట్య కళాకారులు చేసిన నృత్యాంశాన్ని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైన సందర్భంగా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య రామినేని శివరాంప్రసాద్‌ మాట్లాడుతూ భారతదేశంలో అనేక నాట్యకళలు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. అందులోనూ తెలుగు వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే ఆంధ్రనాట్యానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు పంచశత ఆంధ్రనాట్య సంగమం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు కావటం ఆనందంగా ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఆంధ్రనాట్యాన్ని విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్రనాట్యానికి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రఖ్యాత నాట్యాచార్యులు, అభినవ సత్యభామ కళాకృష్ణ, కళారత్న పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు తదితరులు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రఖ్యాత నాట్యకళాకారులు కళాకృష్ణ మాట్లాడుతూ తమ గురువు పద్మశ్రీ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ మరుగున పడిన ఆంధ్రనాట్యానికి పునరుజ్జీవం తీసుకురావడం కోసం పాటుపడ్డారన్నారు. వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్‌ మాట్లాడుతూ కళల వికాసానికి పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు అపూర్వమైన సేవలందిస్తున్నారన్నారు. సంస్థ వ్యవస్థాపకులు కళారత్న పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు పంచశత ఆంధ్రనాట్య సంగమంలో భాగస్వాములు కావడం విశేషమన్నారు. సుమధుర కళానికేతన్‌ప్రధాన కార్యదర్శి పసుమర్తి భాస్కరశర్మ, మాజీ కార్పొరేటర్‌ మరుపిళ్ల రాజేష్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆ సంస్థ ప్రతినిధులు గుర్తింపు పత్రాలను నిర్వాహకులకు అందించారు. పలువురు కళకారులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించారు.

ఏఎన్‌యూ రెక్టార్‌

ఆచార్య రామినేని శివరాంప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement