గుంటూరు వెస్ట్: జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా అధికారులతో కలసి శనివారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో జిల్లా ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రధానంగా కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్, ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అందిన అర్జీలు నూరు శాతం పరిష్కారం, కేటాయించిన బడ్జెట్ మురిగిపోకుండా చూడాలని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను వివరించారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను అనుసంధానం చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశిత సమయానికి నివేదికలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలను గురించి ఆలోచించాలని, సంబంధిత ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు దీనికి అనుగుణంగా ఏ పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలన్నారు. ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కే శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ


