‘ఆట’విడుపు.. మేలుకొలుపు గుంటూరు వెస్ట్ (క్రీడలు): మారుతున్న బిజీ జీవితంలో పిల్లలపై అమితమైన ప్రేమాభిమానాలు పెంచుకుంటున్న తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కోసం, చక్కని ఆరోగ్యం కోసం ఎంత వరకు సమయాన్ని వెచ్చిస్తున్నారనేది కొంత ప్రశ్నార్థకమే. కారణం దంపతులిద్దరూ కష్టపడితేగానీ బతుకు బండి ముందుకు సాగని రోజులివి. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం వెచ్చించలేకపోతున్నారు. అందుకే పదేళ్లు నిండకుండానే పిల్లల్లో ఊబకాయం, మానసిక రుగ్మతలు, కళ్లజోడు వస్తున్నాయి. మరికొంత మంది తమ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే మన జోలికి రారు అనే భావనలోనూ ఉంటున్నారు. ఇది మరింత ప్రమాదకర పరిస్థితి. అయితే ఏడాది పొడవునా పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించలేకపోయినా కనీసం వేసవిలోనైనా పిల్లల్ని శిక్షణ కార్యక్రమాల్లో చేర్పించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైదానంలో పిల్లలు గంటకు తగ్గకుండా తమకిష్టమైన క్రీడలో సాధన చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు.
బాల్యం ఎవరికై నా ఒక అద్భుతమే. కారణం కల్మషం లేని చిన్నారుల మనసుకు అదో గొప్ప ప్రపంచం. అంత చిన్నతనంలోనూ విపరీతమైన శక్తి విడుదల కావడం కారణంగానే పిల్లలు అంత హుషారుగా ఉంటారు. ఇది వారికొక వరమనే చెప్పాలి. ఇక వేసవి వస్తుందంటే చిన్నారులకు ఎంతో సరదా. కారణం స్కూల్‌కు సెలవులు. కొన్ని రోజులపాటు పుస్తకాలు, క్లాస్‌రూమ్స్ వంటివి ఉండవు. ఆటపాటలతో సెలవులను గడిపేస్తారు. అల్లరిని, విపరీతమైన హుషారును తగ్గించాలంటే క్రీడలతోపాటు వారికిష్టమైన మార్గంలోకి మళ్లించడం చక్కని ఉపాయమని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో గొప్ప క్రీడాకారులు వేసవి శిక్షణ ద్వారా వెలుగులోకి వచ్చారు.
● క్రీడలకు పూర్తిగా
దూరమవుతున్న నేటి బాలలు
● ఇకనైనా కన్నవారు మేల్కొంటేనే
బంగారు భవిష్యత్తు
● ఆటల్లోనే చిన్నారులకు
ఆనందం... ఆరోగ్యం
● ఏదోకటి ఆడితేనే శారీరక,
మానసిక ఆరోగ్యం మెరుగు
● వేసవిలోనైనా శిక్షణ శిబిరాల్లో
చేర్చాలని వైద్యుల సూచన
● ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో
ప్రత్యేక శిబిరాలు
బాల్యం ఒక అద్భుతం