చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అప్పుల ఊబిలోకి అన్నదాతలు
దయనీయంగా పరిస్థితి
కొనుగోలు కేంద్రాలెక్కడ?
నేలతల్లిని నమ్ముకున్న కర్షకుడి కంట చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కన్నీరే మిగిలింది. రెండేళ్లుగా ఏ పంట వేసిన కనీస మద్దతు ధర మాటలకే పరిమితం కావడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ గోడు చెప్పుకొనే దిక్కు లేక.. దయ లేని పాలకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాడేపల్లి రూరల్: కృష్ణా డెల్టా ప్రాంతమంటే పంటలు పండించడంలో ఎంతో పేరుంది. కానీ రెండు సంవత్సరాల నుంచి రైతులు నష్టాలపాలవుతున్నారు. అయినప్పటికీ నేల తల్లిని నమ్ముకున్న అన్నదాతలు ఇప్పుడైనా కలిసి రాకపోదా.. అనే ఆశతో సాగు కొనసాగిస్తూనే ఉన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను పండించిన వారికి ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన తప్పడం లేదు. భూమి కలిగిన రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంట చేతికి రాగానే గ్రామాల్లో అప్పులు ఇచ్చిన వారితోపాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు నగదు కోసం అడగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట విక్రయించి బాకీలు తీరుద్దామన్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి మద్దతు ధరకు కొనుగోళ్లు లేకపోవడంతో దళారులకు అయినకాడికి అమ్మేస్తున్నారు.
పెట్టుబడులు కూడా రాని దైన్యం
మంగళగిరి ఒక్క నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న పంటలను వేలమంది రైతులు కౌలుకు తీసుకుని పండించారు. గతంలో వరి 70 కేజీల బస్తా రూ.1,900 నుంచి రూ.2,100 ఉంది. ప్రస్తుతం దాని ధర రూ. 1,250 నుంచి రూ. 1,350 పలుకుతోంది. బస్తాకు రైతు సుమారు రూ.700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నాడు. ఎకరానికి 40 బస్తాలు దిగుబడి ఉంటే సగటున రూ.28 వేల నుంచి రూ.32 వేలు నష్టం వాటిల్లుతోంది. గతంలో మొక్కజొన్న రూ.2,600 ఉండగా ప్రస్తుతం క్వింటా రూ. 1,700 ఉంది,. బస్తాకు రూ.900 వరకు రైతులు నష్టపోతున్నారు. ఎకరానికి 35 బస్తాలు పండిస్తే రూ. 31,500 నష్టమే మిగులుతోంది. జొన్న గతంలో రూ. 2,400 ఉంటే ప్రస్తుతం రూ.1,500 ఉంది. క్వింటా బస్తాకు రూ.900 నష్టపోతున్నారు. అంటే ఎకరానికి 35 బస్తాలు అయితే రూ. 31,500 నష్టం తప్పడం లేదు. దీంతో ప్రతి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇక బతుకు ‘సాగే’దెలా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేనే మూడు ఎకరాలలో మొక్కజొన్న పంట వేశాను. ఎరువుల నుంచి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు అన్ని విషయాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.2,400 ప్రకటించినా నేటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు లేకుంటే రైతులకు అస్సలు ఏమీ ఖర్చులు కూడా రావు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. లేదంటే దళారుల వల్ల రూ.900 నష్టంగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. – కొండూరి అబ్రహం, దుగ్గిరాల
గ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఎకరం కౌలు రూ.40 వేలు చెల్లించాలి. కొంత డబ్బును వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుగా తీసుకున్నా. కొనుగోలు కేంద్రాలు లేవు, గిట్టుబాటు ధర ఊసే లేదు. ఏమీ తోచని పరిస్థితి. దళారులకు అమ్మితే క్వింటాకు రూ.900 వరకు నష్టపోవాల్సి వస్తోంది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. ఎరువులు కోసం ఎన్నో కష్టాలు పడి మరీ వ్యవసాయం చేశాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – సిద్దాబత్తుని ఆంజనేయులు, దుగ్గిరాల


