యార్డులో చైర్మన్, కార్యదర్శి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం భారీగా కొనసాగుతున్న జీరో వ్యాపారం చంద్రబాబు సర్కారు హయాంలో యథేచ్ఛగా రైతుల నుంచి దోపిడీ వాటాల కోసం అధికారులతో పాలకవర్గం గొడవలు
మిర్చి యార్డులో పాలకవర్గం, అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిర్చి యార్డులో భారీగా జరుగుతున్న జీరో వ్యాపారంపై వచ్చే నగదులో తమకు కూడా వాటా ఇవ్వాలని పాలకవర్గం పట్టుపడుతుండటం, దీనిపై గురువారం కార్యవర్గం సమావేశం కావడం యార్డులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి కార్యదర్శి గైర్హాజరు అయ్యారు. ఎప్పుడుపడితే అప్పుడు సమావేశాలు పెడితే తాను రానని కార్యదర్శి చెప్పినట్లు పాలకవర్గ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కార్యదర్శి వైఖరిపై మండిపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డుకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన డబ్బుల్లో తమ వాటా చెల్లించాల్సిందేనని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మిర్చి యార్డు కార్యదర్శి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బంధువు కావడంతో తమను అసలు లెక్క చేయడం లేదని పాలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రభుత్వ ఖాతాకు గండి
యార్డులో గత రెండేళ్లుగా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో యార్డుకు రావాల్సిన సెస్ రాకపోవడంతో ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఏడాదిన్నర తర్వాత పాలకవర్గం వచ్చినా అధికారులు మిర్చి యార్డుపై తమ పెత్తనం కొనసాగిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ.కోట్లల్లో వ్యాపారం జరిగే ఇక్కడ సెస్ రూపంలో ఆదాయం కూడా ఎక్కువగానే రావాలి. కానీ ఇది యార్డ్ ఖాతాలో జమ కావడం లేదని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలను పట్టించుకోకుండా మిర్చి కొనుగోలు చేస్తూ రైతులను ముంచేస్తున్నారు. మిర్చి యార్డులో జరుగుతున్న జీరో వ్యాపారం, దానిపై వచ్చే ఆదాయం విషయంలోనే అధికారులు, పాలకవర్గం మధ్య గొడవలు తలెత్తాయి. జీరో వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు పట్టుపడుతున్నట్లు సమాచారం.
ఇంకా ఎన్నో విధాలుగా...
ఇదే కాకుండా బిల్ టు బిల్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మిర్చి యార్డులో రైతులు, ఎగుమతి వ్యాపారులకు మధ్యవర్తిత్వం చేసి కోనుగోళ్లు జరపడానికి కమీషన్ ఏజెంట్లు పని చేస్తుంటారు. రైతులకు కొనుగోలు చేసిన రోజే డబ్బులు చెల్లిస్తారు. వీరు మార్కెట్ యార్డు నుంచి లైసెన్స్ కలిగి ఉంటారు. లైసెన్స్ లేనివారు ఇప్పటికే ఉన్న వారి పేరుతో వ్యాపారం చేస్తూ వాస్తవంగా వసూలు చేయాల్సిన రెండు శాతానికి బదులుగా రెట్టింపు తీసుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న వేమెన్లు, సూపర్‌వైజర్లు, యార్డు యంత్రాంగానికి కాసుల వర్షం కురుస్తోంది. బిల్ టు బిల్ విధానానికి సహకరించినందుకు బస్తాకు రూ.పది వరకూ వసూలు చేస్తున్నారు. యార్డులో వచ్చే అవినీతి డబ్బుల కోసం పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య రచ్చ జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజిలెన్స్ శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి.


