ఉద్యోగుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పోరుబాట

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

సమస్యల పరిష్కారానికి గతంలో లోకేష్‌ హామీ రెండేళ్లు అవుతున్నా స్పందించని చంద్రబాబు ప్రభుత్వం 15న మంత్రి ఇంటికి కుటుంబసభ్యులతో మహా పాదయాత్ర

ఇవీ డిమాండ్లు..

ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనాపాలన, పాఠశాల నిర్మాణం .. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

సత్తెనపల్లి: జిల్లాలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ) నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం. విద్యాశాఖ కార్యకలాపాలు అనేకం వీరి సేవలతోనే కొనసాగుతున్నాయి. అటువంటి ఉద్యోగులు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి సుమారు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 373 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు.

విసిగిపోయి..

ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్‌ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా డిమాండ్లను విస్మరించారు. మినిమం టైం స్కేల్‌ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్‌ సమావేశాల్లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇంటికి మహా పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు.

అందిస్తున్న సేవలివీ...

మండల విద్యా వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఎంఐఎస్‌) కోఆర్డినేటర్‌ వ్యవహరిస్తారు. క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ) పర్యవేక్షిస్తారు. మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ) కార్యాలయం నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్‌ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రీసోర్స్‌ టీచర్స్‌ (ఐఈఆర్‌టీ) నిలుస్తారు. వారికి కేర్‌వింగ్‌ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్‌, పీఈటీ, తదితర విధుల నిర్వహణలో పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్‌ ఇంజినీరు పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.

● ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి.

● రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.

● హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి

● మినిమం టైం స్కేల్‌, ఇంటి అద్దె, కరువు భత్యం ఇవ్వాలి.

● రూ. 10 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, గ్రాట్యూటీ, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలి.

● ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి.

● వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవులు ఇవ్వాలి.

● మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి.

● కారుణ్య నియామకాలు చేపట్టాలి.

● డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి.

Advertisement
 
Advertisement
Advertisement