అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి లక్ష్మీదేవి అలంకారంలో మహంకాళి అమ్మవారు మిర్చి యార్డును సందర్శించిన స్పైసెస్‌ బోర్డు చైర్‌పర్సన్‌ శేషవాహనంపై శ్రీవారి దర్శనం

గుంటూరు ఎడ్యుకేషన్‌: గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిషు పాలకులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాతంత్య్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాటపటిమతో బ్రిటిష్‌ సైన్యాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. అల్లూరి వంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని చెప్పారు. అల్లూరి ఆశయ సాధనకోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారులు రాజా రత్నం, ఉమా సుమంత్‌, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చిలువూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మ వారికి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.

కొరిటెపాడు(గుంటూరు): స్పైసెస్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ సంగీత విశ్వనాథన్‌ గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ప్రస్తుత మిర్చి వ్యాపార పరిస్థితులు, నాణ్యత పరిరక్షణ చర్యలు, ప్రాసెసింగ్‌ విధానాలు, మిర్చి ఎగుమతులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యార్డు అధికారులు, వ్యాపార వర్గాలతో అభిప్రాయాలు పంచుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లలో అవకాశాలు పెంచే దిశగా స్పైసెస్‌ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా సంగీత విశ్వనాథన్‌ను యార్డు చైర్మన్‌ కుర్రా అప్పారావు సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పైసెస్‌ బోర్డు సభ్యుడు కొత్తూరి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, పలువురు యార్డు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలిరోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. స్వామి వారి భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement