గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

రోడ్లపైనే నేలకొరిగిన వృక్షాలు నిలిచిపోయిన ట్రాఫిక్‌

రోడ్లపైనే నేలకొరిగిన వృక్షాలు

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి రూరల్‌ పెనుమాక, ఉండవల్లి, పట్టణ పరిధిలోని నులకపేట, ప్రకాష్‌నగర్‌, డోలాస్‌నగర్‌, శర్మ డాబా ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వెళ్లే పాత జాతీయ రహదారి వెంబడి శర్మ డాబా వద్ద నుంచి ప్రకాష్‌నగర్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వర్షం తగ్గిన తరువాత ఈ రహదారిలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎంటీఎంసీ కమిషనర్‌ అలీంబాషా కార్పొరేషన్‌ సిబ్బందితో జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను తొలగింపజేశారు. 2 కి.మీ. వ్యవధిలో పలుచోట్ల భారీ వృక్షాల కొమ్మలు తొలగించడానికి 2 గంటల సమయం పట్టింది. వాటిని తొలగించే క్రమంలో ట్రాఫిక్‌ నిలిచిపోయి, ద్విచక్రవాహనాలు సైతం కార్పొరేషన్‌ సిబ్బంది అనుమతించలేదు.

గాలివానకు ఎగిరిపడిన రేకులు

మంగళగిరి టౌన్‌ : మంగళగిరిలో గురువారం అకాల వర్షం కురవడంతో మండల పరిధిలోని యర్రబాలెం గ్రామంలో ఓ ఇంటి రేకులు ఎగిరి వీధిలో పడ్డాయి. హఠాత్తుగా వీచిన భారీ ఈదురు గాలుల వల్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిలువ నీడను కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement