నగరంపాలెం: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. గురువారం స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించారని అన్నారు. అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు సేవా భావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), పోలీస్ కార్యాలయ ఏఓ ఎం.వసంతరావు, ఏఏఓ జగన్నాథ రావు, ఆర్‌ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్జీరంగా వర్సిటీలో అల్లూరికి నివాళి
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో గురువారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ, బయో టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ పి ఆనంద్‌కుమార్‌లు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ అల్లూరి స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం చేసిన త్యాగాలు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ తెగువ, నిబద్దత, దేశభక్తికి అల్లూరి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎంవీ రమణ, కంప్ట్రోలర్ డాక్టర్ బి ముకుందరావు, పీజీ డీన్ డాక్టర్ పీ మునిరత్నం, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ డి సంపత్‌కుమార్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ జి కరుణసాగర్, లైబ్రెరియన్ డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, పాలిటెక్నిక్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేవ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ పీ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.


