తాడికొండ: ‘పరిహారానికి పదేళ్లా’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. బాధితుడు చుండు నర్సిరెడ్డి, సోదరుడు చుండు వెంకటరెడ్డిలకు కలిపి ఉన్న 14 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేశారు. సర్వే రిపోర్టును అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ భూమికి సంబంధించి 1962 లోనే వారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని సుమారు 70 సంవత్సరాలుగా స్వాధీనంలో ఉంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి, 1956 ఈనాం యాక్ట్ చట్టం ప్రకారం రైతువారీ పట్టా ఉంది, ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని పంటలు పండించుకుంటూ ప్రతిఏటా పంట రుణం కూడా తీసుకుంటున్నారు. అయితే తమకు తెలియకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో భూమిని ఎలా తొలగిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో ఎందుకు తొలగించారంటే తహసీల్దార్ సైతం తమకు తెలియదంటున్నారని, ఒక్క వడ్డమాను గ్రామంలోనే ఈనాంకు చెందిన 100 ఎకరాలను ఆన్‌లైన్‌లో ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. పూలింగ్‌కు ఇచ్చిన 2 ఎకరాల కోళ్ల ఫారం పరిహారం విషయంలో ఇంకా అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తన భూమిని తనకి తిరిగి ఇచ్చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
బాధితుడి ఈనాం భూములకు సర్వే
నిర్వహించిన రెవెన్యూ, సర్వే సిబ్బంది
1962 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని
తమ స్వాధీనంలోనే ఉన్నట్లుగా తెలిపిన బాధితులు


