తాడికొండ: రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలని సీఆర్డీయే కమిషనర్ వి విజయరామరాజు అన్నారు. భూసేకరణ కార్యకలాపాలలో భాగంగా రాయపూడి, నేలపాడు గ్రామాలలో ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, ఎల్‌పీఎస్ జోన్లు, పలు అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్ ) చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ తెలిపారు. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున రాజధాని గ్రామాల రైతులు అధికారులకు సహకరించాలన్నారు. గ్రామ కంఠాల, లంక భూముల వ్యవహారంపై రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నా ఎలాంటి హామీ లభించలేదు. మా సమస్యలు తీర్చితే ఇస్తామని పలువురు బాధితులు మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ఏభార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కెఎస్ భాగ్యరేఖ, బి సాయి శ్రీనివాస నాయక్ ఇతర సీఆర్డీయే అధికారులు పాల్గొన్నారు.


