సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

May 7 2026 8:02 AM | Updated on May 7 2026 8:02 AM

జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయి కాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయి కాంత్‌ వర్మ ఆకాంక్షించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందరిరం నుంచి విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుండి 12 గంటల వరకు స్టడీ అవర్స్‌ నిర్వహించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి హాజరు కావాలని స్పష్టం చేశారు. 20 రోజులపాటు జరిగే స్టడీ అవర్స్‌లో విద్యార్థి ఏ విభాగంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించాలని, మంచి తర్ఫీదు అందించి వారిలో విజ్ఞాన తృష్ణ పెంచడంతో పాటు సమర్ధత పెంచాలన్నారు. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించాలని చెప్పారు. విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా, ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహిస్తారని హెచ్చరించారు. పదవ తరగతిలో తప్పిన విద్యార్థులు అందరూ సప్లిమెంటరీ పరీక్షలలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రతి చిన్నారి ఒకటవ తరగతికి ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది అంచనాల మేరకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన చిన్నారులు 22,672 మంది ఉన్నారని, అయితే కనీసం 12,470 మంది పిల్లలను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మంగళగిరి, గుంటూరు, తెనాలి, కొల్లిపర, చేబ్రోలు మండలాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుండి ఐదు సంవత్సరాలు నిండి బయటకు వస్తున్న చిన్నారులు 10,679 మంది ఉన్నారని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త, ప్రధాన ఉపాధ్యాయుడు సమన్వయం చేసుకోవడం ద్వారా ఆ చిన్నారులు అందరిని ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఈఓ డా.షేక్‌ సలీం బాషా, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.ప్రసూన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement