భూగర్భ జలాలు పెరగాలి | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలు పెరగాలి

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

గుంటూరు వెస్ట్‌: జలధార–జలహారతి కార్యక్రమంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. జలధార–జలహారతి కార్యక్రమంపై మంగళవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పనులు నీటి వనరుల నిల్వలు పెంచడానికి, నీటిని సంరక్షించడానికి, సాగు నీటి వ్యవస్థ బలోపేతం కావడానికి తోడ్పడాలన్నారు. ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్‌ కాలువలను పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు, ప్రస్తుత భూగర్భ జలాలు విశ్లేషించి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న మండలాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార– జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఫీడర్‌ కాలువల పునరుద్ధరణ పనులను ఉపాధి హామీ పథకం కింద వేతనదారుల ద్వారా చేపట్టాలన్నారు. కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవడం, లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని, ఫీడర్‌ కాలువలను పూర్తిగా పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచాలన్నారు. గొలుసుకట్టు చెరువులపైనా శ్రద్ధ వహించాలన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తద్వారా వర్షాలు కురిసే సమయంలో మంచి ఫలితాలు సాధించగలమని, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని కలెక్టర్‌ వివరించారు.

జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ

Advertisement
 
Advertisement
Advertisement