మాన్యువల్‌ మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మాన్యువల్‌ మాయాజాలం

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

మాన్యువల్‌ మాయాజాలం నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ రెవెన్యూ సెక్షన్‌లో రాష్ట్రంలో ఎక్కడ లేని వింత పోకడ నడుస్తోంది. ప్రభుత్వం ప్రతి సర్వీస్‌కు సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారానే జరగాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ జీఎంసీ రెవెన్యూ విభాగంలో ఇంటి పన్నులకు సంబంధించిన దరఖాస్తులు కేవలం మాన్యువల్‌ ఫైల్‌(ఫిజికల్‌)గా పెట్టి దానిని కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు చూసి సంతకం పెడితేనే అప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. ఫిజికల్‌ ఫైల్‌ సకాలంలో ప్రాసెస్‌ చేయకపోవడంతో అర్జీదారులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుంటే ఫైల్‌పై సంతకాలు జరిగిపోవడంతో పాటు ఆన్‌లైన్‌ కూడా వేగంగా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొంతమంది డబ్బులు ఇచ్చుకోలేని వారు తమ అర్జీలను పరిష్కరించాలని కోరుతూ ఎంతకీ పని జరగకపోవడంతో పీజీఆర్‌ఎస్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఆస్తి పన్నులకు సంబంధించి ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 7,093 దరఖాస్తులు రాగా ఇందులో వివిధ కారణాల చేత తిరస్కరింపబడిన దరఖాస్తులు 2,970 ఉన్నాయి. గడువు తీరిన తరువాత క్లోజ్‌ చేసిన దరఖాస్తులు 787, ఓపెన్‌లో ఉన్న దరఖాస్తులు 736 కాగా గడువు తీరిపోయినప్పటికీ క్లోజ్‌ చేయని దరఖాస్తులు 190 దాకా ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సచివాలయానికి ఎవరైన పన్ను వేయాలని వస్తే వెంటనే అడ్మిన్‌ సెక్రటరీలు ఆర్‌ఐని కలవాలని చెబుతుండటం గమనార్హం. ఎవరైన ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకుంటే దానిని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్‌ కొట్టడం రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వం ఆస్తి అమ్మకాలు, కొనుగోలు సమయంలోనే పన్ను మారిపోయే విధంగా ఆటోమ్యూటేషన్‌ కార్యక్రమం కొనసాగిస్తుంది. అయితే ఈ ఆటోమ్యూటేషన్‌కు సంబంధించి అన్ని చలనాలు ప్రభుత్వానికి చెల్లించిన తరువాత సదరు ఫైల్‌ అప్రూవల్‌ కోసం నగరపాలక సంస్థకు వస్తుంది. దీనిని అప్రూవ్‌ చేసుకోవాలన్నా దరఖాస్తుదారులు రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందే.. ఎవరైన ఖాళీ స్థలాలను వేరే వ్యక్తులకు అమ్మినప్పుడు సదరు ఖాళీ స్థలానికి పన్ను రిజిస్ట్రేషన్‌ శాఖ వద్దే వీఎల్‌టీ(వేకేంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) సంబంధించిన సర్వీస్‌ రిక్వెస్ట్‌ జనరేట్‌ అవుతుంది. ఆ రిక్వెస్ట్‌ జీఎంసీ లాగిన్‌కు వస్తుంది. జీఎంసీలో రెవెన్యూ అధికారులు సదరు అర్జీదారునితో మాట్లాడుకుని మీకు ఖాళీ స్థల పన్ను రూ.లక్షల్లో వస్తుంది.. మీకు పన్ను వేయకుండా ఉండాలంటే మాకు కొంత ఇస్తే ఆ రిక్వెస్ట్‌ను రిజెక్ట్‌ చేస్తామని చెప్పడంతో అటు అర్జీదారునికి మేలు జరుగుతుండటంతో అర్జీదారులు రెవెన్యూ అధికారులు అడిగింది ఇచ్చుకుని, ఖాళీ స్థలానికి పన్ను లేకుండా చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కార్పొరేషన్‌కు రూ.కోట్లు నష్టం వాటిల్లుతుందనే చెప్పుకోవచ్చు.

అదనపు కమిషనర్‌ లేకపోవడంతో...

గుంటూరు నగరపాలక సంస్థలో ఇటీవల వరకు చల్లా ఓబులేసు అదనపు కమిషనర్‌గా పనిచేశారు. ఆయన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అవడంతో, ఆయన స్థానంలో వైజాగ్‌లో జోనల్‌ కమిషనర్‌ పనిచేస్తున్న మల్లయ్యనాయుడు విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఆయన విధులు స్వీకరించకపోవడంతో డిప్యూటీ కమిషనర్‌–1కి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన ఫైల్స్‌ అన్ని కూడా పెండింగ్‌లో ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రమంతా ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ సేవలు

జీఎంసీలో మాత్రం మాన్యువల్‌ గానే..

మాన్యువల్‌గా ఫైళ్లు చూసి సంతకం చేసిన

తరువాతే ఆన్‌లైన్‌లో పెడుతున్న రెవెన్యూ సిబ్బంది

ఆన్‌లైన్‌లో ఫైళ్లు సకాలంలో పెట్టకపోవడంతో

సమయం వృథా అవుతుందంటూ

లబోదిబోమంటున్న అర్జీదారులు

రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వచ్చే ఆన్‌లైన్‌ ఫైల్స్‌ను

కూడా రిజెక్ట్‌ చేస్తున్న వైనం

గడువు తీరేదాకా అప్రూవ్‌ చేయని

దరఖాస్తులు వందకు పైగానే..

తిరస్కరించిన దరఖాస్తులు 2,970

రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వచ్చే దరఖాస్తులు సైతం..

Advertisement
 
Advertisement
Advertisement