ఓపీ చీటీకి ఓపిక కావాల్సిందే..
వైద్య సేవల కోసం పేద రోగుల పడిగాపులు ఓపీ చీటీ కావాలంటే ఎంతో ఓపిక కావాల్సిందే వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే నిరీక్షించాల్సిందే అందుబాటులో లేని సీనియర్ వైద్యులు మధ్యాహ్నం ఓపీ సేవలు అందితే ఒట్టు చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పడకేసిన వైద్యం
పనివేళలు
పాటించని
వైద్యులు ...
నీటి కష్టాలు తప్పటం లేదు....
రోగుల సహాయకులే మోసుకెళ్లాలి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల పెద్ద ఆసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్‌లో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు అలమటిస్తున్నారు. సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు ప్రతి రోజూ 3 వేల మందికిపైగా గుంటూరు జీజీహెచ్‌కు వస్తున్నారు. రోగులకు సరిపడా వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఆసుపత్రి అధికారులు విఫలమవుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన సీనియర్ వైద్యులు మధ్యాహ్నానికే ఇళ్లకు, సొంత క్లినిక్‌లకు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పర్యవసానంగా పెద్ద ఆసుపత్రిలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి గంపెడంత ఆశతో చికిత్స కోసం వస్తున్న నిరుపేదలు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.
గుంటూరు మెడికల్: జీజీహెచ్‌కు క్యాజువాలిటీ (ఎమర్జన్సీ వార్డు) గుండె లాంటిది. రోడ్డు ప్రమాదాల బాధితులు, దాడుల్లో గాయపడిన వారు, విషప్రభావానికి గురైన వారిని అత్యవసర సేవల విభాగంలో (ఎమర్జెన్సీ వార్డు) చేరుస్తారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు (డీఏపీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు (డీఏఎస్)లు అందుబాటులో ఉండటం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంట్ ఉన్నప్పటికీ సదరు వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుల పనితీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సరెండర్ చేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆసుపత్రి మొత్తానికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర వైద్య విభాగంలో అత్తెసరు వైద్య సేవలు మాత్రమే లభిస్తున్నాయి. ఎమర్జెన్సీ వార్డులో పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ ఆస్పత్రిలో నివాసం ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జన్సీ వార్డులో అందుబాటులో ఉండటం లేదు. నర్సింగ్ అధికారుల పర్యవేక్షణ కూడా మొక్కుబడిగా కొనసాగుతోంది.
వైద్య పరీక్షల కోసం ఎదురు చూపులు....
జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షలు ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్ట్రక్చర్‌లపై, వీల్‌చైర్‌లలో ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి సైతం రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్‌లకు సైతం ఇదే తరహా కష్టాలు రోగులకు తప్పడం లేదు. ఉదయం ఓపీలో చూపించుకున్న రోగి రిపోర్ట్‌ల కోసం సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. రిపోర్ట్‌లు చేతికి అందేసరికి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. రోగులు రిపోర్ట్‌లు చేతిలో పట్టుకుని ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లి మరోరోజు వైద్య సేవల కోసం రావాల్సి వస్తోంది.
ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కు.....
పెద్దాసుపత్రికి వచ్చి చనిపోతే వారి భౌతిక కాయాన్ని తరలించాలంటే... ముఖ్యంగా రాత్రి వేళల్లో తరలించాలంటే బంధువులు రూ.వేలల్లో ప్రైవేటు అంబులెన్స్‌ల వారికి డబ్బులు చెల్లించాల్సిందే. మృతదేహాలను తరలించే కాంట్రాక్ట్‌ను మహాప్రస్థానం పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వారు సాయంత్రం ఆరు గంటలు దాటితే సేవలు నిలిపివేస్తున్నారు. రాత్రివేళ చనిపోతే మరుసటిరోజు వరకు వార్డులో లేదా మార్చురీలో ఉండాల్సిందే. లేదంటే రాత్రి వేళల్లో ప్రైవేటు అంబులెన్స్‌ల వారికి పదివేల వరకు చెల్లించి మృతదేహాలను తరలించుకోవాల్సి వస్తుందని బంధువులు వాపోవుతున్నారు. మహాప్రస్థానం వాహనాల సేవలు అంతంత మాత్రమే ఉంటున్నా ఆస్పత్రి అధికారులు వారికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
అర్ధాకలితో విధుల నిర్వహణ
జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్య సిబ్బందికి ఏడాదిపైగా వేతనాలు చెల్లించలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 700 మందికి పైగా రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు రాక పలువురు వైద్య సిబ్బంది అర్ధాకలితో విధులు నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సైతం ప్రతినెలా వేతనాలు చెల్లింపులు జరగటం లేదు. జీతాలు నెలా నెలా రాకపోవటంతో వారు ఫోన్‌పే స్కానర్‌లు పెట్టి మరీ మామూళ్లు అడుగుతున్న వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముట్టజెప్పాల్సిందే...
కాన్పుల విభాగంలో, మార్చురీ వద్ద, ఆపరేషన్ థియేటర్‌ల వద్ద అధిక మొత్తంలో మామూళ్లు వసూలు చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. రోగులకు కట్టుమార్చే వారు సైతం ముడుపులు తీసుకుని డ్రెస్సింగ్ చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పుట్టినా, గిట్టినా ముడుపులు తప్పనిసరి అన్నట్లుగా కింది స్థాయి ఉద్యోగులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ మామూళ్ల రోగం తీవ్ర స్థాయిలో ఉందని ఆసుపత్రి ఉద్యోగులు వాపోతున్నారు. ఏ ఫైల్ కదలాలన్నా ముడుపులు ముట్టచెప్పాల్సిందే. నర్సింగ్ కార్యాలయంలో కూడా సెలవుల మంజూరుకు, డ్యూటీల కేటాయింపునకు మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందులు, సర్జికల్, ఆక్సిజన్, వర్క్‌షాపు బిల్లుల మంజూరుకు పర్సంటేజీలు ఇవ్వకపోతే సంతకాలు చేయడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
నీళ్ల బాటిల్ కొనుగోలు చేసి తీసుకెళుతున్న దృశ్యం
క్యాన్సర్ ఆసుపత్రి వద్ద పనిచేయని వాటర్ కూలర్
వీల్‌చైర్‌పై రోగిని తీసుకెళుతున్న సహాయకురాలు
గుంటూరు జీజీహెచ్‌లో అవుట్ పేషెంట్ విభాగంలో (ఓపీ) చికిత్స పొందాలంటే తొలుత ఓపీ చీటీ తీసుకోవాలి. ఆసుపత్రి అధికారులు ఓపీ చీటీల ప్రక్రియను ఆన్‌లైన్ చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్, ఆధార్ కార్డు ఉండి గంటసేపు క్యూలో ఉంటే ఓపీ చీటీ చేతికందుతుంది. తీరా ఓపీ చిటీ తీసుకుని వైద్యుల వద్దకు వెళితే అక్కడ సీనియర్ వైద్యులు వార్డుల్లో బిజీగా ఉంటూ జూనియర్ వైద్యులతో ఓపీ వైద్య సేవలను మమా అనిపిస్తున్నారు.
ఎండలకు జీజీహెచ్‌లో రోగులు నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నారు. తాగునీరు తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాతల సాయంతో కూలింగ్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేసినా వాటిల్లో నీటిని నింపే ప్రక్రియ సక్రమంగా చేయకపోవటంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కూడా తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. వార్డుల్లో ఉంటున్నవారు మరుగుదొడ్లు వినియోగించేందుకు, ఇతర అవసరాల కోసం నీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నారు.
నిబంధనల ప్రకారం జీజీహెచ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. భోజన విరామం కోసం గంట గ్యాప్ ఇస్తే, మిగతా సమయమంతా ఓపీల్లో వైద్యులు ఉండి చూడాల్సిందే. కానీ పెద్ద ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు పనివేళలు పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వారు తీరిగ్గా 10 గంటలకు ఓపీకి వస్తున్నారు. కొంత మంది హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు ఓపీ వైద్య సేవలకు డుమ్మా కొడుతున్నారు. ఓపీ విభాగానికి వచ్చిన సీనియర్ వైద్యులు రోగులను చూడకుండా ఓపీ సమయంలోనే వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతూ మధ్యాహ్నం చేయాల్సిన విధులను ఓపీలో చేసేసి మధ్యాహ్నం విధులు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. కొంత మంది వైద్యులు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ఇళ్లకు, సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కొంత మంది పీజీ వైద్యులతో కొన్ని వైద్య విభాగాల వారు ఈవినింగ్ క్లినిక్‌ను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పెద్దాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు వారంలో కేవలం రెండు రోజులు లేదా మూడు రోజులు మాత్రమే ఓపీలు నిర్వహిస్తారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవల కోసం రోగులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. విధులు నిర్వహించని వైద్యులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించటం విమర్శలకు తావిస్తోంది.
ఆసుపత్రిలో రోగులను వార్డులోకి తరలించేందుకు అవసరమైన వీల్‌చైర్లు, స్ట్రక్చర్లు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని వీల్‌చైర్లు తుప్పుబట్టిపోయి వినియోగించడానికి పనికి రాకుండా ఉంటున్నాయి. రోగుల బంధువులే వైద్య పరీక్షల కోసం, వార్డుల్లో అడ్మిషన్ కోసం రోగులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. రోగులను తరలించాల్సిన కింది స్థాయి ఉద్యోగులు ఆసుపత్రిలో ఉన్నారో.. లేరో.. అన్నట్లు ఉంది. వీరిపై అజమాయిషీ చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది.


