జిల్లాలో 98.06 శాతం హాజరు పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు ఏఎన్‌యూలో అవకాశం కోల్పోయిన విద్యార్థిని గుంటూరులో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీలు
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను నీట్ టెన్షన్ పెట్టింది. మండుటెండలో సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆలస్యమైతే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతామోననే ఆందోళన విద్యార్థులలో కనిపించింది. ఆదివారం వైద్య విద్య కోర్సుల జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2026)కు గుంటూరు జిల్లాలో 98.06 శాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 24 కేంద్రాల పరిధిలో కేటాయించిన 8,417 మంది విద్యార్థుల్లో 8,299 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 11 నుంచే ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో సందడి నెలకొంది. ఉదయం 11.30 నుంచి విద్యార్థులను ఆయా కేంద్రాల్లోనికి అనుమతించారు. అంతకుముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆభరణాలు, వాచీలు, టోపీలను తొలగింపచేశారు. అన్ని కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాన గేట్లు మూసివేస్తామని ఎన్‌టీఏ నిబంధనల్లో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చిన ఓ విద్యార్థినిని లోనికి అనుతించలేదు. దీంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయిన ఆమె కన్నీరు పెట్టుకుంది. గుంటూరు సాంబశివపేటలోని ఏసీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
వసతులు కల్పించలేదని
తల్లిదండ్రుల ఆగ్రహం
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నీట్ రాసేందుకు పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. మొత్తం 2,976 మందికిగాను 2,911 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. కానీ పరీక్ష సమయం 2 గంటలకు అని స్థానికులు చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లింది. ఇంటి నుంచి వర్సిటీకి చేరుకునే క్రమంలో 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ప్రధాన ద్వారం గేటు వేశారు. ఆ విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా అవకాశం లేదని, పరీక్ష రాసే విద్యార్థి తంబ్ (వేలిముద్ర) తీసుకోదంటూ వెనక్కి పంపించారు. 30 సెకన్లు ఆలస్యంగా వచ్చిన మరో విద్యార్థిని విషయంలో డీఎస్పీ మురళీకృష్ణ చెప్పడంతో లోనికి అనుమతించారు. వేలాదిగా తల్లిదండ్రులు వర్సిటీ వద్దకు తమ పిల్లలతో చేరుకున్నారు. నిర్వాహకులు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడం, తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయడకపోవడంతో చెట్ల కింద, జాతీయ రహదారి అండర్‌పాస్ కింద వారు గడపాల్సి వచ్చింది. విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులకు వసతులు కల్పించడంతో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని, కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల కింద, ప్రధాన ద్వారం ఎదుట కూర్చోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు మండిపడ్డారు. వర్సిటీ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నాసరయ్య తదితరులు కూడా విషయంలో అధికారుల తీరును ఖండించారు. పెదకాకాని సీఐ టి. పెద నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.


