రేషన్ దుకాణం నిర్వహిస్తున్న మహిళలకు ఈస్ట్ డీటీ బెదిరింపులు అక్రమంగా షాపుపై దాడి చేసి కేసులో ఇరికించారని బాధితుల ఆరోపణ
పట్నంబజారు: ‘మీరు ప్రతి నెల డబ్బులు ఇవ్వాల్సిందే... ఒక వేళ ఇవ్వలేకపోతే... నా దగ్గర వేరే మార్గం ఉంది’ అంటూ గుంటూరు ఈస్ట్ డీటీ భాస్కర్ ఒక డ్వాక్రా గ్రూప్ ద్వారా నడుపుతున్న రేషన్ డీలర్ తిరుమలశెట్టి శివలీల, ఆమె బంధువు ఉప్పుతల విజయలక్ష్మి పట్ల అసభ్యకరంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిర ప్రియదర్శిని కాలనీలోని రేషన్ దుకాణం వద్ద వారిద్దరు నిరసన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఉన్న 183 నెంబర్ రేషన్ డిపోను తిరుమలశెట్టి శివలీల ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఆమె ప్రస్తుతం డ్వాక్రా గ్రూప్ లీడర్‌గా ఉన్నారు. ఈస్ట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే డీటీ భాస్కర్‌కు నెల రూ.5 వేల చొప్పున ఇస్తున్నామని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రీవెన్స్‌లో డీటీ భాస్కర్‌పై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే 18వ తేదీన రూ 1.50 లక్షలు ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది కూడా ఇవ్వాలని అడుగుతున్నారని, తమకు ఆ పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ఫోన్‌లు చేసిన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని, అందులో జిల్లా పౌరసరఫరాల అధికారికి రూ. లక్ష వాటా వెళ్తుందని, అన్ని రేషన్ షాపులు వారు ఇస్తున్నారని, మీరెందుకు ఇవ్వరని వేధిస్తున్నారని తెలిపారు. అది ఇవ్వలేదనే కోపంతోనే, పైగా తాను కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాననే కక్షతో ఈ నెల 2వ తేదీ రాత్రి ఒక ఆటోలో కొంత మంది వ్యక్తులతో బియ్యం తీసుకుని వచ్చారని చెప్పారు. అవి తమ షాపులో పెడుతున్న సమయంలో ప్రశ్నించినా ఏం ఫర్వాలేదు తాను చూసుకుంటామని చెప్పారని తెలిపారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కథంతా మార్చేసి.. బియ్యం తమ షాపులో అధికంగా ఉందని చెప్పి అక్రమంగా కేసు నమోదు చేసి, బలవంతంగా సంతకం చేయించుకున్నారని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్రమంగా షాపుకు తాళం వేసి వెళ్లిపోయారని తెలిపారు. ప్రతి నెలా రేషన్ మాఫియాకు సైతం తాను చెప్పిన వారికే బియ్యం విక్రయించాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. డీటీ భాస్కర్ తీరుకు స్థానికులంతా ప్రత్యక్ష సాక్షులని చెప్పారు. స్థానికులు, రేషన్ డిపో ఇంటి యజమాని సైతం డీటీ భాస్కర్ కొంత మంది ప్రైవేట్ వ్యక్తులతో వచ్చి దౌర్జన్యం చేశారని చెబుతున్నారు.


