వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచే తేదీలను తక్షణమే ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఎప్పటి నుంచి ప్రారంభించేది రైతులకు వివరణ ఇవ్వకుంటే, మొక్కజొన్న అమ్మకాల్లో తీవ్రమైన సందిగ్ధత, నిరాశ నెలకొనే అవకాశముందన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు నినియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్పత్తి వచ్చిన నేపథ్యంలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. రాజకీయ విందు సమావేశాలను పక్కన పెట్టి, రైతుల కడుపు నింపే విధంగా మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన విధంగా రూ.2,400 మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గ బోర్డర్ అయిన వడ్లమూడిలోని సంగం డెయిరీలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరతో కొని, నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు సిద్ధం చేసిన భారీ మొక్కజొన్న నిల్వలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తీసుకువచ్చి సీజ్ చేయించి, సంగం డెయిరీ ద్వారా అక్రమ నిల్వలకు సంబంధించి వ్యత్యాసం డబ్బులను రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ కొనుగోళ్ల దళారీల గ్యాంగ్ లీడర్ పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై చర్యలు తీసుకోకపోవడం, రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశం సీఎం చంద్రబాబుకు, డీసీఎం పవన్ కళ్యాణ్‌కు లేదని అర్ధమవుతోందన్నారు. ఇప్పటికే రైతాంగం కళ్లు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్న మొక్కజొన్న పంట కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించకుంటే, రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి గల తీరు ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు.


