రోడ్డెక్కితేనే గానీ బాధితులకు న్యాయం చివరికి తమకు అన్యాయం జరిగినా మౌనమే అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే..!
తెనాలి: తమ రూటే సెపరేటు అన్నట్టుగా తయారయ్యారు తెనాలి పోలీసులు. కేసుల నమోదు, నిందితుల అరెస్టులో విమర్శలు వస్తున్నా పట్టటం లేదు. చివరకు పోలీసులపై దాడి కేసుల్లోనూ నిందితులను గోప్యంగా ఉంచుతున్నారు. అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే కేసుల నమోదు, నిందితుల అరెస్టు వంటివి జరుగుతున్నాయనేది బహిరంగంగానే వినిపిస్తోంది. ఇటీవల అంగలకుదురులో జరిగిన దాడి కేసులోనూ పోలీసులు ఇదే వైఖరిని అవలంభించారు. గ్రామస్తులంతా మూకుమ్మడిగా రోడ్డుపై ధర్నాకు దిగితేగాని తత్వం బోధపడలేదు. సాధారణ సెక్షన్లతో నమోదుచేసిన కేసును హత్యాయత్నం కేసుగా మార్చుతామనీ, నిందితులను అరెస్టు చేస్తామని హామీని ఇవ్వాల్సివచ్చింది.
● రూరల్ మండలం అంగలకుదురులో గత నెల 28వ తేదీ సాయంత్రం రోడ్డుపై వాహనం పార్కింగ్ విషయమై గ్రామానికి చెందిన వెలగా తులసీరామ్, షేక్ నాగుల్‌మీరాల మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి 9:45 గంటల ప్రాంతంలో నాగుల్‌మీరా, మరి కొంతమందిని వెంటతీసుకుని తులసీరామ్ ఇంటికి వవెళ్లారు. ఇంట్లో ఉన్న అతడిని కిందకు కొట్టుకుంటూ తీసుకురావడమే కాకుండా, వస్తువులను ధ్వంసం చేసి, దొమ్మీకి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిని తులసీరామ్‌ను స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు నిందితులపై బీఎన్‌ఎస్ 324, ఇంట్లోకి దొమ్మీపై వెళ్లటంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
● టీడీపీ ఆధిక్యత కలిగిన అంగలకుదురులోకి బయట వ్యక్తులు ప్రవేశించి తులసీరామ్‌పై అతడి ఇంట్లోనే మందిగా వచ్చి దాడికి పాల్పడటంపై గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అంగలకుదురు గ్రామ పరిరక్షణ సంఘంగా ఏర్పడి సమావేశం పెట్టుకున్నారు. రక్తగాయాలు వచ్చేలా దాడిచేసిన కేసులో 324 సెక్షన్ పెట్టటం, దొమ్మీపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టటం నచ్చలేదు. పైగా మూడురోజులైనా నిందితులను అరెస్టు చేయని పోలీసుల వైఖరిపై మండిపోయారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగకపోతే న్యాయం జరగదన్న భావనతో శనివారం సాయంత్రం అంగలకుదురులో తెనాలి–గుంటూరు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు బైక్‌లను అడ్డుపెట్టారు. ప్లకార్డులను చేతపట్టి పోలీసుల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఫలితంగా రద్దీ రహదారిలో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు, సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ధర్నా చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీసుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తప్పని పరిస్థితుల్లో నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని, దాడిపై నమోదు చేసిన సెక్షన్‌నూ మారుస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.


