జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనసత్కారం
గుంటూరు వెస్ట్: ‘విద్యార్థులూ... మీ విజయం స్ఫూర్తిదాయకం.. భవిష్యత్ విజేతలు మీరే..’ అని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ కొనియాడారు. తన మాతృమూర్తి ఉపాధ్యాయురాలని, ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ఎంతో గౌరవం ఉందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుల అభినందన సభ ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది.
కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పది ఫలితాల్లో జిల్లాను గర్వకారణంగా నిలిపారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల ఉన్న అపోహలన్నింటికీ సమాధానం మీరేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరూ.. మీమీ పాఠశాలల్లోని తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు స్ఫూర్తిని, ప్రేరణను నింపాలన్నారు. పిల్లల చదువులకు సహకరించి, గొప్ప విజయాలు సాధించడంలో తోడ్పాటును అందించిన తల్లిదండ్రులను అభినందించారు. ఉత్తమ ఫలితాల సాధనలో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. నేటి ప్రభుత్వ విద్యార్థుల మార్కులు చూస్తే తనకే ఈర్ష్యగా ఉందంటూ.. అంతటి ఘనవిజయానికి కృషి చేసిన
ఉపాధ్యాయులకు సెల్యూట్ చేశారు.
● జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ జిల్లా నుంచి 27,012 మంది పరీక్షలకు హాజరు కాగా 24,011 మందితో 88.89 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో జిల్లా నిలిచిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సత్కరించారు. మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


