న్యూస్‌రీల్
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు.
నగరంపాలెం: విశ్వశాంతిని కాంక్షిస్తూ బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు.
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.8200, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది.
రమణీయం.. రథోత్సవం
పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి దివ్య రథోత్సవం స్వర్ణపురి పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం పూలతో విశేషంగా అలంకరించిన రథంపై స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, స్వామివారి నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. ఆలయ ప్రాంగణం నుంచి కసుకర్రు రోడ్డు వరకు రథోత్సవం సాగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు అందించారు. డప్పు కళాకారుల సందడి ఆకట్టుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవదాయ సహాయ కమిషనర్ గాండ్ల కామేశ్వరమ్మ, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధర తిలక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
7


